AP Employees Associationఏపీ ప్రభుత్వోద్యోగుల సంఘానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మద్య మొదలైన పంచాయతీ హైకోర్టుకి చేరింది. ఉద్యోగ సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో తెలియజేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తమకి నోటీస్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ఉద్యోగ సంఘం నేతలు హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

తాము పలుమార్లు మంత్రివర్గ కమిటీని, ఆర్ధిక శాఖ అధికారులని జీతాలు, పెన్షన్స్, డీఏ బకాయిల గురించి అడుగుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని అందుకే రాష్ట్ర గవర్నర్‌ బిశ్వాభూషణ్ హరిచందన్‌ని కలిసి తమ గోడు మొరపెట్టుకొన్నాము తప్ప ప్రభుత్వంపై ఫిర్యాదు చేయలేదని పిటిషన్‌లో హైకోర్టుకి తెలియజేశారు. కానీ రోసా చట్టం ప్రకారం గవర్నర్‌ని కలిసినందుకు తమ ఉద్యోగ సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో తెలియజేయాలని షోకాజ్ నోటీస్ ఇచ్చిందని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు.

కనుక రాష్ట్ర ప్రభుత్వం తమపై, తమ సంఘంపై ఎటువంటి చర్యలు చేపట్టకుండా ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వోద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తరపు సీనియర్ న్యాయవాదులు పీవీజీ ఉమేష్ చంద్ర, వైవీ రవిప్రసాద్ హైకోర్టుని అభ్యర్ధించారు.

ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు తీర్పుని రిజర్వులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. అంతవరకు ఉద్యోగ సంఘాల నేతలపై, వారి సంఘంపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టవద్దని మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

అనంతరం ఏపీ ప్రభుత్వోద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, “మేమేమీ ప్రభుత్వాన్ని గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకి ప్రతీ నెల 1వ తేదీన జీతాలు చెల్లించాలని అడుగుతున్నాం. కనీసం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మా బకాయిల చెల్లింపులకి నిర్ధిష్టమైన షెడ్యూల్ ప్రకటించాలని కోరుతున్నాము. ఉద్యోగ సంఘాల నేతలందరూ భేషజాలు పక్కన పెట్టి ఫిభ్రవరి 2వ తేదీన జరిగే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశానికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. దానిలో మన సమస్యలు, వాటి చట్ట బద్దతపై మాట్లాడుకొని సమైక్య కార్యాచరణని రూపొందించుకొందాము,” అని అన్నారు.