AP Election comission denies voters list manipulationఓటర్ల జాబితాలతో కొందరు మోసానికి తెగబడుతున్నారని, సర్వే పేరుతో ఒట్లు తొలగించే కుట్రలు చేస్తున్నారని వైఎస్సాఆర్ కాంగ్రెస్ నేతలు తరచుగా అభియోగాలు చెయ్యడం మనకు తెలిసిందే. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అయితే ఏకంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం ఓటర్ జాబితాలో ఏకంగా 65 లక్షల దొంగ ఓట్లు చేర్చిందని కంప్లయింట్ ఇచ్చారు. తరువాత గవర్నర్ కు కూడా కంప్లయింట్ చేశారు. దీనిపై ఎన్నికల సంఘం విచారణకు కూడా ఆదేశించింది.

అయితే విచారణ అనంతరం ఇది వట్టి ఆరోపణే అని తేలింది. ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల తొలగింపు అనేది పుకారు మాత్రమే అని ఎవరూ నమ్మవద్దని ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా ను ప్రభావితం చెయ్యడం అనేది అసాధ్యమని, ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. జనవరి 11 వరకు నమోదైన ఓటర్ల జాబితా చెక్ చేసుకోవచ్చని ఆయన చెప్పారు. నామినేషన్ చివరిరోజు వరకు జాబితాలో మార్పులు, చేర్పులకు అవకాశం ఉందన్నారు.

దీనితో ఇప్పటివరకు వైఎస్సాఆర్ కాంగ్రెస్, జనసేన పార్టీలు దీనిపై చేసిన ఆరోపణలన్నీ బోగస్ అని తేలింది. కేవలం అధికార పార్టీని ఏదో విధంగా ఇరుకున పెట్టడానికే చేసిన పని లా అనిపించకమానదు. మరోవైపు మనకు ఉన్న సమాచారం ప్రకారం వచ్చే నెల మొదటి వారంలో రెండు ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అవుతుందని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్, సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఒకేసారి విడుదల చేయబోతుంది కేంద్ర ఎన్నికల సంఘం.