AP CID POlice at Chintakayala Vijay House in Hyderabad మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్‌కు నోటీసులు ఇచ్చేందుకు ఏపీ సీఐడీ పోలీసులు శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో గల ఆయన ఇంటికి వెళ్లారు. అయితే ఆ సమయంలో ఆయన, భార్య ఇద్దరూ ఇంట్లో లేరు. పిల్లలు, డ్రైవరు, నౌకరు, వంటమనిషి, వాచ్ మ్యాన్ మాత్రమే ఉన్నారు. ఇంట్లో సార్, మేడమ్ ఇద్దరూ లేరని చెపుతున్నా వినకుండా సుమారు 10 మంది ఏపీ సీఐడీ పోలీసులు ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారని ఆయన ఇంట్లో పనిచేస్తున్న నౌకరు మీడియాకు చెప్పాడు.

లోపల పిల్లలు తప్ప ఎవరూ లేరని చెపుతున్నా ‘నువ్వు తలుపులు తీస్తావా లేకుంటే మమ్మల్ని పగలగొట్టుకొని లోపలకి వెళ్లమంటావా?’ అని వారు హెచ్చరించడంతో తాను తలుపులు తీశానని ఆ వ్యక్తి చెప్పాడు. వారు లోపలకి ప్రవేశించి అన్ని గదులలో తిరుగుతూ బెడ్ రూమ్‌లోని కప్ బోర్డు వద్దకు వెళుతుంటే అందులో బట్టలు తప్ప ఏమీ లేవని నేను చెప్పగా ‘ఆయన అందులో దాకొన్నారా?’ అని వెటకారంగా మాట్లాడారని ఆ వ్యక్తి చెప్పాడు.

వారు ఇల్లంతా తిరిగి వంటింట్లోకి కూడా ప్రవేశించి ‘సార్’ కోసం వెతికారని చెప్పాడు. ఆ తర్వాత వారు సార్ డ్రైవర్‌ని బయటకి తీసుకువచ్చి చితకబాదారని ఆ వ్యక్తి చెప్పాడు. ఈలోగా ఈ విషయం తెలుసుకొని మీడియా ప్రతినిధులు, అడ్వకేట్ కూడా అక్కడికి వచ్చి ఏపీ సీఐడీ పోలీసులను ఎందుకు వచ్చారని ప్రశ్నించగా సోషల్ మీడియా కేసుకు సంబందించి 41 సీఆర్‌పీసీ కింద నోటీస్ ఇవ్వడానికి వచ్చామని ఏపీ సీఐడీ పోలీసులు చెప్పారు. తాము కేవలం నోటీస్ ఇవ్వడానికే వచ్చామని ఎవరినీ కొట్టలేదని చెప్పారు. చింతకాయల విజయ్ దంపతులు ఇంట్లో లేకపోవడంతో నోటీసుకు వారి సిబ్బందికి ఇచ్చి వెళ్ళిపోతున్నామని చెప్పారు. అయితే ఏ కేసుకు సంబందించి నోటీస్ ఇవ్వడానికి వచ్చారని మీడియా ప్రశ్నకు వారు జవాబు చెప్పలేదు నోటీసులో అన్నీ వివరంగా పేర్కొన్నామని చెప్పి వెళ్ళిపోయారు.

ఆ నోటీసులో ఈ నెల 6వ తేదీన మంగళగిరి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని సూచించారు. వచ్చేటప్పుడు విజయ్ ఉపయోగిస్తున్న రెండు ఫోన్లను తీసుకువచ్చి తమకు అప్పగించాలని నోటీసులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

చింతకాయల విజయ్ ఇంట్లోకి ఏపీ సీఐడీ పోలీసులు జొరబడి ఇంట్లో పిల్లలని, పనివారిని భయపెట్టినందుకు టిడిపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న బంజారాహిల్స్‌ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఇంట్లో దూరి సోదాలు చేయడాన్ని వారు తప్పు పడుతున్నారు. ఏపీ సీఐడీ పోలీసులపై హైదరాబాద్‌లోని టిడిపి నేతలు బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.