AP--BJPఆంధ్రప్రదేశ్ లో ఎలాగైనా పాగా వేయాలని పగటి కలలు కంటోన్న భారతీయ జనతా పార్టీ దుస్థితికి నిదర్శనంగా ఈ అరుదైన ఫోటోను పేర్కొనవచ్చు. ఇటీవల ఏపీ బిజెపి అధ్యక్షుడిగా పార్టీ బాధ్యతలు చేపట్టిన కన్నా లక్ష్మీ నారాయణ శ్రీకాకుళం పర్యటన సందర్భంగా క్లిక్ మన్న ఫోటో ఇది. నిజానికి ఈ పిక్ లో చాలా విషయం ఉంది, జనాలు లేకపోవడం అన్నది చెప్పుకోదగిన అంశం కాదు, కనీసం జనాలు చూడకపోవడం అనేది ఈ పిక్ లో అసలైన హైలైట్ అబ్బాయ్!

సాధారణంగా ఏ రాజకీయ నాయకుడు వెళ్ళినా ఏదో కొద్దో గొప్పో జనాలు వస్తుంటారు, లేదంటే కనీసం కార్యకర్తలనైనా పోగు చేసి హంగామా సృష్టిస్తుంటారు. కానీ కన్నా పర్యటనలో జనాలు లేరు, కార్యకర్తలు లేరు. విశేషం ఏమిటంటే… ఫోటోలో కనపడుతోన్న ఇతర వ్యక్తులలో కనీసం ఒక్కరు కూడా కన్నా వైపుకు చూడకపోవడం! అలాగే తమవైపుకు ఎవరు చూస్తారా అంటూ జీపును పట్టుకున్న వాళ్ళు కూడా ఆశగా పక్క చూపులు చూడడం ఈ ఫోటోలో గమనించదగ్గ మరో అంశం.

అయితే ఇలాంటి దుస్థితి బిజెపికి కొత్తేమీ కాదు. అందుకే సొంత పార్టీని నమ్ముకోకుండా వైసీపీని, జనసేనను నమ్ముకుందన్న విషయం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఆ రెండు పార్టీల అధినేతలకు అయితే ఓట్లు రాలినా లేకున్నా, కనీసం జనాలైనా వస్తారు కదా! ఏడాది కాలంలో ఎన్నికలు ఉండడంతో ఇలాంటి అరుదైన ఫోటోలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో! మానసికంగా బిజెపి నేతలంతా సిద్ధమై ఉండడం ఉత్తమమేమో!