ap-bjpఆంధ్రప్రదేశ్ కు ‘ప్రత్యేక ప్యాకేజ్’ ఇచ్చినప్పటికీ, ‘ప్రత్యేక హోదా’ ఇవ్వలేమని కేంద్రం తేల్చిచెప్పేయడంతో… రాష్ట్ర ప్రజలలో బిజెపిపై వ్యతిరేక భావన ఏర్పడుతున్న మాట వాస్తవమే. ప్యాకేజ్ విషయంలో సంతృప్తి వ్యక్తపరిచినప్పటికీ, హోదా కోసం అడిగి తీరుతామని టిడిపి నాయకులు ప్రకటనలు చేస్తుండడంతో… హోదా విషయంలో తప్పంతా బీజేపీదేనని చెబుతూ, ఓ పథకం ప్రకారం బిజెపిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతోందని బీజేపీ నేతలు అనుమానాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

మరో రెండేళ్ల తరువాత ఎన్నికలు జరిగే ముందు చంద్రబాబు, బీజేపీని విమర్శిస్తూ, కటీఫ్ చెబుతారని, అది జరగబోయే ముందే, టిడిపికి ఆ అవకాశం ఇవ్వకుండా బీజేపీయే తెగతెంపులు చేసుకుంటే సంస్థాగతంగా ఎదగవచ్చని పలువురు బీజేపీ నేతలు అధిష్ఠానం పెద్దల ముందు వ్యాఖ్యానించినట్టు సమాచారం. బీజేపీ జిల్లా పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్ చార్జ్ లతో గత వారంలో కేంద్రం నుంచి వచ్చిన అరుణ్ సింగ్, సిద్ధార్థ నాథ్ సింగ్ లు సమావేశమైన వేళ, బీజేపీయే ముందుగా స్పందించి తెలుగుదేశంతో విడిపోతే వచ్చే లాభనష్టాలపై రాష్ట్ర నేత కందుల రాజమోహన్ రెడ్డి చేసిన ప్రసంగం, రాజకీయ విశ్లేషణ అందరినీ ఆకర్షించిందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

కాంగ్రెస్ పార్టీని మరో పదేళ్ల వరకూ ఎవరూ నమ్మే పరిస్థితి లేదని, ఇదే సమయంలో ప్రజా విశ్వాసాన్ని చూరగొనడంలో జగన్ ఆధ్వర్యంలోని వైకాపా విఫలమవుతోందని చెబుతూ, కొత్తగా ఓటు హక్కు వచ్చే యువతకు బీజేపీ దగ్గర కావచ్చని చెప్పారట. చంద్రబాబు నాయుడు అమరావతి పేరిట కోస్తాపై ఎక్కువగా దృష్టి పెట్టారని, మిగతా ప్రాంతాల ప్రజలు అభివృద్ధికి దూరమవుతున్నారని, ప్రధానంగా రాయలసీమలో వ్యతిరేకత పెరిగిందని, ఉత్తరాంధ్ర వాసులు కూడా తమను పట్టించుకోవడం లేదని భావిస్తున్నారని గుర్తు చేస్తూ, బాబుతో కటీఫ్ చెబితేనే బాగుంటుందని విశ్లేషించారట.

ఈ పరిస్థితుల్లో చంద్రబాబు కన్నా ముందే బీజేపీ స్పందించాలని కందుల సూచనలు చేయగా, ఇప్పటికిప్పుడు ఇలాంటి అంశాలు బయటకు వెళితే బాగోదని, శివసేనతో సైతం ఇలాగే సంబంధం కొనసాగిస్తున్నామని చెప్పిన కేంద్రం నేతలు, సమయం వచ్చినప్పుడు ఆలోచిద్దామని రాష్ట్ర నాయకులకు చెప్పినట్టు సమాచారం. అయితే ఏపీ రాజకీయాలలో ఎన్ని వైపరీత్యాలు జరిగినప్పటికీ, బిజెపికి సొంత ఓటింగ్ రావడమనేది ఓ ‘కల’ మాత్రమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.