Anushka Shetty to shake legs with mahesh babu“బాహుబలి 2” సినిమా విడుదలైన తర్వాత అనుష్క క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. ‘యువరాణి’ అంటే ఇలాగే ఉండాలి అనిపించే విధంగా కన్నులవిందు చేసిన అనుష్క, మళ్ళీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన “సాహో” సినిమాలో నటిస్తుందన్న విషయం తెలిసిందే. అలాగే ఇప్పటికే “భాగమతి” సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసింది. కధానాయికకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకుంటున్న అనుష్క, ‘భరత్ అనే నేను’ సినిమాలో కూడా కనిపించబోతుందనేది ట్రేడ్ వర్గాల టాక్.

అయితే ఫుల్ లెంగ్త్ రోల్ లో కాదు, ప్రిన్స్ పక్కన ఓ స్పెషల్ సాంగ్ లో మెరవనుందని సినీ వర్గాల గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో మహేష్ బాబు పక్కన “ఖలేజా” సినిమాలో తళుక్కుమన్న అనుష్క, ఆ సినిమాలో ఇద్దరి జంటకు ఆశించినంత గుర్తింపు లభించలేదు. దీంతో మరోసారి జత కట్టలేదు. అయితే తాజాగా సెట్స్ పైనున్న “భరత్ అనే నేను”లో ఓ స్పెషల్ సాంగ్ కోసం ‘కొరటాల అండ్ కో’ సంప్రదించగా, అనుష్క ఓకే చెప్పినట్లుగా వార్తలు గుప్పుమన్నాయి.

ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి సరసన ‘స్టాలిన్’ సినిమాలో, ‘కింగ్’ నాగార్జున ‘కేడీ’ సినిమాలలో అనుష్క స్పెషల్ సాంగ్స్ ను చేయగా, రెండూ సానుకూల ఫలితాలను ఇవ్వలేదు. చిరు సినిమా కనీసం యావరేజ్ మార్క్ ను అందుకోగా, నాగ్ చిత్రం దారుణ పరాజయాన్ని చవిచూసింది. దీంతో స్వీటీ ఐటెం సాంగ్స్ సినీ ఇండస్ట్రీ సెంటిమెంట్స్ కు ప్రతికూలంగా ఉన్నాయి. ఒకవేళ “భరత్ అనే నేను”లో కూడా ఇలాగే స్పెషల్ గా మెరిస్తే… ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో కూడా చూడాలి.