Anushka Shetty Kids Planning ‘ఆలు లేదు, సూలు లేదు అల్లుడేమో సోమలింగం’ అన్నడంటా వెనుకటికొకడు. ప్రస్తుతం మన ‘స్వీటీ’ అనుష్క మాటలు కూడా అలాగే ఉన్నాయి అంటున్నారు సినీ జనాలు. ‘బాహుబలి – ది కన్ క్లూజన్’ సినిమాతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ, తన పెళ్లి తర్వాత పుట్టబోయే పిల్లల కెరీర్ గురించి చెప్తుంటే… ముక్కు మీద వేలేసుకోవడం నెటిజన్ల వంతవుతోంది. అసలు పెళ్లి ఊసే లేని అనుష్క ఒక్కసారిగా, వేదాంత ధోరణిలో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కబుర్లను చెప్పుకొచ్చింది.

“తనకు వివాహమైన తరువాత పుట్టే పిల్లలు కూడా సినిమా రంగంలోకి వెళ్తామని చెబితే, అందుకు సంతోషంగా అంగీకరిస్తానని” ఈ బెంగుళూరు బ్యూటీ సెలవిచ్చింది. అన్ని రంగాల్లో ఉన్నట్టే సినిమా రంగంలో సైతం మంచీచెడులు ఉన్నాయని, మనం వేసే అడుగులు, తీసుకునే నిర్ణయాలపైనే ఏవైనా ఆధారపడి ఉంటాయని” సినీ పరిశ్రమకు అనుకూలంగా కీలక వ్యాఖ్యలు చేసింది.

“తాను చిత్రసీమలోకి ప్రవేశించిన తొలినాళ్లలో సైతం ఎవరూ ఇబ్బంది పెట్టలేదని, అత్యంత సురక్షితమైన రంగాల్లో సినిమా ఫీల్డ్ ఒకటని తాను బల్లగుద్ది చెప్పగలనని, సినిమా రంగంపై ఒక్కొక్కరి అభిప్రాయాలను వింటుంటే తనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుందని, తనకు ఎదురైన మంచి, చెడులకు తానే కారణమని, మరొకరిని కారణమని చెప్పబోనని” అనుష్క చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.