Anushka Shetty Bhaagamathie  breaks rajamouli sentimentసెంటిమెంట్స్ కు నిలయంగా ఉండే సినీ పరిశ్రమలో దర్శకధీరుడు రాజమౌళి గురించి ఓ ప్రచారం ఎప్పుడూ లైంలైట్ లో ఉండేది. అదేమిటంటే… జక్కన్న చిత్రాలలో నటించిన వారికి కీర్తి ప్రతిష్టలతో పాటు, భారీ సక్సెస్ కూడా దరి చేరుతుంది. కానీ ఆ సక్సెస్ అనేది రాజమౌళి చిత్రంతోనే ఆగిపోతుందని, ఆయా నటీనటుల తదుపరి సినిమాలు సక్సెస్ కావనే సెంటిమెంట్ ఉండేది. జక్కన్న చిత్రాల ట్రాక్ రికార్డ్ ను చూస్తే ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు. చివరగా సునీల్ ‘మర్యాద రామన్న’ నుండి ఇప్పటికీ తేరుకోలేకపోయారనేది ప్రత్యక్ష సాక్ష్యం.

అయితే ఈ సెంటిమెంట్ కు ‘స్వీటీ’ అనుష్క బ్రేక్ వేసింది. ‘బాహుబలి 2’తో ఆలిండియా రికార్డులను సొంతం చేసుకున్న అనుష్క, తాజాగా విడుదలైన “భాగమతి” సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరో బంపర్ హిట్ ను అందుకుంది. ఈ ఏడాదిలో టాలీవుడ్ కు తొలి సూపర్ హిట్ ను అందించిన ఘనత కూడా అందాల బొమ్మ అనుష్కకే దక్కడం విశేషం. ఇలా రాజమౌళి సెంటిమెంట్ కు బ్రేక్ వేసిన నటుల జాబితాలోకి అనుష్క కూడా చేరింది. ఇంతకుముందే ఈ సెంటిమెంట్ ను మరో ‘బాహుబలి’ హీరో రానా కూడా బ్రేక్ చేసాడు.

‘బాహుబలి 2’ సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన రానా, ఆ తర్వాత ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో హిట్ అందుకోవడంతో, జక్కన్న సెంటిమెంట్ కు బ్రేక్ పడింది. ‘బాహుబలి 2’లో ముగ్గురిలో ఇద్దరు ఇప్పటికే సూపర్ హిట్స్ అందుకోగా, నెక్స్ట్ వంతు టైటిల్ రోల్ పోషించిన ప్రభాస్ వంతవుతోంది. నిజానికి జక్కన్న ‘సక్సెస్’ సెంటిమెంట్ ఎక్కువగా హీరోలకే వర్తిస్తోంది గనుక, ప్రభాస్ గనుక “సాహో”తో బొమ్మ తిరగేస్తే, అప్పుడు నిజంగానే రాజమౌళి సెంటిమెంట్ కు బ్రేక్ పడినట్లుగా ఆపాదించుకోవచ్చు.