Anurag Kashyap Comments on Pushpa and kantaraఫిలిం మేకింగ్ ఎప్పటికప్పుడు దర్శకులు తమని తాము అప్ డేట్ చేసుకోవాల్సిన నిత్య ప్రక్రియ. ఎప్పుడైతే ఆడియన్స్ పల్స్ మీద పట్టు కోల్పోతారో అక్కడి నుంచి పతనం మొదలవుతుంది. దాని ఫలితంగా ఎలా మెరుగుపడాలనే ఆలోచనలకు బదులు పక్కోళ్ల క్రియేటివిటీ మీద ఎలాంటి విమర్శలు చేద్దామా అనే దుగ్ద ఎక్కువవుతుంది. ముఖ్యంగా బాలీవుడ్లో ఈ బాపతు జనాలు బాగా పెరిగిపోతున్నారు. సౌత్ డామినేషన్ ని ధీటుగా ఎదురుకోలేక వాటిని తలదన్నే బ్లాక్ బస్టర్లు తీసే సత్తా తగ్గిపోవడం, గొప్పలు చెప్పుకున్న బ్రహ్మాస్త్ర లాంటివి ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ లాంటి వాటి దరిదాపుల్లోకి వెళ్లలేకపోవడం వీటికి ప్రధాన కారణాలు. అందుకే ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది.

ఇటీవలే తనను తాను కల్ట్ డైరెక్టర్ గా భావించే అనురాగ్ కశ్యప్ పుష్ప కాంతార మీద చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో పెద్ద చిచ్చే రేపాయి. ఇవి బాలీవుడ్ ని నాశనం చేశాయంటూ ప్రతి ఒక్కరు సంస్కృతి మూలాలోకి వెళ్లేలా ప్రేరేపిస్తున్నాయని పుష్ప తరహా సినిమాలు అందుకే నార్త్ ఆడియన్స్ కి నచ్చేశాయని ఏదేదో అనేశాడు. సరే ప్రజాస్వామ్యం హక్కు ఇచ్చింది కాబట్టి ఏదైనా అనొచ్చు కానీ అవసరం లేకపోయినా పుష్ప లాంటివి చెడగొడుతున్నాయనే అర్థం వచ్చేలా మాట్లాడ్డం మీదే నెటిజెన్లు భగ్గుమంటున్నారు. అనురాగ్ ఇటీవలే తీసిన దొబారా కనీసం యుఎఫ్ఓ ఛార్జీలు రాబట్టలేనంత దారుణంగా డిజాస్టర్ కావడంలో ఆ టైంలో వచ్చిన కాంతార ప్రభావం ఉంది.

Also Read – అవసరం లేనప్పుడు రివర్స్ గేర్.. ప్రమాదమేగా?

అది మనసులో పెట్టుకునే ఇలా విషం చిమ్ముతున్నాడని అంటున్నవాళ్ళున్నారు. ది కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ అనురాగ్ వైఖరిని దుయ్యబట్టారు. గ్యాంగ్స్ అఫ్ వసేపూర్ లాంటి వయొలెంట్ డ్రామా తీసిన కశ్యప్ ఇలా నీతులు చెప్పడం ఎవరికైనా మండేలా చేస్తుంది. పుష్ప మీద ఇంత అక్కసు ఎందుకయ్యా అంటే ఒకదశలో థియేటర్ రిలీజ్ వద్దనుకున్న స్టేజి నుంచి ఇప్పుడు పుష్ప 2 థియేట్రికల్ రైట్స్ కోసం హిందీ నిర్మాతలు కోట్లు పోసేందుకు సిద్ధ పడటం దాకా ఎన్నో జరిగాయి. ఏ బాలీవుడ్ మూవీ దేశం దాటి వెళ్ళలేదు. ఆర్ఆర్ఆర్ జపాన్ చేరుకుంది. పుష్ప రష్యాలో డబ్బింగ్ అయ్యింది.

ఇవన్నీ మన ఘనతలే. ఐఎండిబి టాప్ 10 ఇండియన్ మూవీస్ లో తొమ్మిది దక్షిణాదివే ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అనురాగ్ కశ్యప్ బయట పడ్డాడు కానీ లోలోపల రగిపోతున్న వాళ్ళు ఎందరో. పుష్ప 2 వచ్చేనాటికి ఎవరెవరు బయట పడతారో చూడాలి. అప్పుడెప్పుడో రానాని మీరంతా మసాలా సినిమాలు తీస్తారు కదాని ఒక నార్త్ యాంకర్ ఎగతాళిగా అడగటంతో మొదలై ఇప్పుడు పుష్ప లాంటి సినిమా రిలీజ్ అవుతుందంటే దానితో ఎందుకు పోటీలే అని బాలీవుడ్ నిర్మాతలు భయపడే దాకా వచ్చింది. అందుకే అనురాగ్ కశ్యప్ లే కాదు ఎందరు ఎన్ని రకాలుగా గుక్కపట్టి ఏడ్చినా రాకెట్ ని ఆపడం నైలాన్ తాడు వల్ల అవ్వదు.

Also Read – డుమ్మా కొట్టడానికి దొడ్డి దారులా..?