Anumula-Revanth-Reddyతెలంగాణలో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా అది అధికార బిఆర్ఎస్‌, బీజేపిల మద్య యుద్ధంగా మారుతుండటంతో కాంగ్రెస్‌ పార్టీ మూడో స్థానానికే పరిమితం అయిపోతోంది. ఈ బిఆర్ఎస్‌-బీజేపి ఉచ్చులో నుంచి బయటపడి కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. కానీ కాంగ్రెస్‌ పార్టీలో నేతల కుమ్ములాటల కారణంగా అది సాధ్యం కావడం లేదు. మునుగోడు ఉపేన్నికలే ఇందుకు తాజా నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ అవలీలగా గెలవగలిగిన ఆ ఉపఎన్నికలలో కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వయంగా పార్టీ అభ్యర్ధి పాల్వాయి స్రవంతిని దారుణంగా దెబ్బ తీశారు. ఎందుకంటే, అయన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు కనుక! ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపిలో చేరి పోటీ చేస్తున్నారు కనుక! ఈవిధంగా కాంగ్రెస్‌ను కాంగ్రెస్‌ నేతలే ఓడించుకోవడం కూడా కాంగ్రెస్ పార్టీలో పరిపాటే.

అయితే కాంగ్రెస్‌ నేతలందరూ ఒక్కతాటిపైకి వస్తే వారిని ఏ శక్తీ అడ్డుకోలేదని కర్ణాటక కాంగ్రెస్‌ నిరూపించి చూపింది. కానీ ఎన్నికలలో గెలవగానే మళ్ళీ ముఖ్యమంత్రి పదవి కోసం సిద్దరామయ్య, శివకుమార్ రెండువర్గాలుగా చీలిపోయి కోట్లాడుకొంటున్నారు. కాంగ్రెస్‌లో ఇది సర్వసాధారణమైన విషయమే కనుక నేతలందరూ కిందామీదాపడి ఈ సమస్యను ఎలాగో పరిష్కరించుకుంటారు. కనుక దాని గురించి ఇప్పుడు ఆలోచన అనవసరం.

అయితే కర్ణాటక కాంగ్రెస్‌ సాధించిన ఈ విజయాన్ని తెలంగాణ కాంగ్రెస్‌ అందిపుచ్చుకొని రాష్ట్రంలో మళ్ళీ రెండో స్థానంలోకి రాగలదా? అనే చర్చ ఇప్పుడు మొదలైంది. ఎందుకంటే, నేటికీ తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి ఉన్నంతమంది బలమైన నేతలు, విస్తృతమైన పార్టీ క్యాడర్, బలమైన ఓటు బ్యాంక్ బీజేపికి లేవు.

అయినప్పటికీ తెలంగాణలో బీజేపిలో రెండో స్థానంలోకి ఎలా నిలువగలుగుతోంది? ప్రతీ ఎన్నికలలో బిఆర్ఎస్‌తో ఎలా పోటీ పడగలుగుతోంది? అంటే బలమైన నాయకత్వం… ఆ నాయకత్వంలో అందరూ కలిసికట్టుగా పనిచేస్తుండటమే కారణంగా కనిపిస్తోంది. కానీ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఇది గుర్తించలేక ప్రతీసారి చతికిలపడుతున్నారు.

అయితే కర్ణాటక శాసనసభ ఎన్నికలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఓ దారి చూపించాయి కనుక ఇకనైనా కాంగ్రెస్‌ నేతలందరూ కలిసికట్టుగా పనిచేయడం అలవరచుకుంటే తెలంగాణ శాసనసభ ఎన్నికలలో విజయం సాధించగలుగుతారు. కానీ తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు ఈ జ్ఞానోదయం అవుతుందా లేదా? చూడాలి.