Another International Company in Hyderabadఏపీకి స్వదేశీ కంపెనీలు సైతం మొహం చాటేస్తుంటే హైదరాబాద్‌కు మాత్రం స్వదేశీ, విదేశీ కంపెనీలు వరుసగా క్యూ కడుతున్నాయి. గత 20 రోజులలోనే హైదరాబాద్‌కు మూడు కంపెనీలు వచ్చాయి. వాటిలో ఒకటి స్వదేశానికి చెందిన రేడియంట్ అప్లయన్సెస్ అండ్ ఎలక్ట్రానిక్స్ కాగా మిగిలినవి రెండూ అమెరికాకు చెందిన గూగుల్, కాల్‌అవే గోల్ఫ్ కంపెనీలు.

రేడియంట్ అప్లయన్సెస్ అండ్ ఎలక్ట్రానిక్స్ రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఇదివరకే రూ.100 కోట్లు పెట్టుబడితో స్మార్ట్ టీవీలు తయారుచేసే పరిశ్రమను ఏర్పాటు చేసింది. దానిలోనే మరో వంద కోట్లు పెట్టుబడి పెట్టి ప్లాంటును విస్తరిస్తోంది. త్వరలో మరో వంద కోట్లు పెట్టుబడి పెట్టి ప్లాంటును ఇంకా విస్తరిస్తామని ఆ సంస్థ ప్రతినిధి చెప్పారు.

హైదరాబాద్‌లో ఇప్పటికే గూగుల్ కార్యాలయం ఉంది. ఇప్పుడు గచ్చిబౌలిలో 7.3 ఎకరాల విస్తీర్ణంలో 33 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో శాస్విత భవనం నిర్మించుకొంటోంది. దీనికి తెలంగాణ ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ ఏప్రిల్ 29న భూమిపూజ చేసారు.

తాజాగా అమెరికాకు చెందిన కాల్‌అవే గోల్ఫ్ కంపెనీ రూ.150 కోట్లు పెట్టుబడితో అతిపెద్ద డిజిటెక్ కేంద్రాన్ని ఏర్పాటుచేసుకొంది. రాయదుర్గం నాలెడ్జ్ సెంటర్‌లో ఏర్పాటైన ఈ కార్యాలయాన్ని తెలంగాణ ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ ఈరోజు ప్రారంభించారు.

గూగుల్, కాల్‌అవే గోల్ఫ్ కంపెనీలు అమెరికా వెలుపల నిర్మించుకొంటున్న అతిపెద్ద కార్యాలయాలు ఇవే కావడం వాటికి హైదరాబాద్‌ నగరాన్ని ఎంచుకోవడం గమనార్హం. ఈవిదంగా తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా…హైదరాబాద్‌ నగరానికి దేశవిదేశాలకు చెందిన వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు ఎందుకు క్యూ కడుతున్నాయి?మన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి, అమరావతికి ఎందుకు రావడం లేదు?అని వైసీపీ నేతలు గడప గడపకు కార్యక్రమంలో ప్రజలనే అడిగి తెలుసుకొంటే బాగుంటుంది కదా?