Another humiliation for YS Jagan, YSRCP, Chandrababu, AP assembly, Jaganmohan reddy YSఓటమి నుండి గుణపాఠాలు నేర్చుకోవడం ఒక రాజకీయ నాయకుడి కనీస లక్షణం. అలా కాకుండా ఓటమి పైన ఓటమి సంభవిస్తోందంటే… ఎక్కడో ఏదో లోపం ఉందని సమాలోచనలు చేసుకోవాలి. కానీ, తానూ పరాభవం పాలవుతానని తెలిసి కూడా తప్పులు చేయడం బహుశా వైసీపీ అధినేత ఒక్క జగన్ వల్లే సాధ్యమేమో అన్న రీతిలో రాజకీయ కధనాలు వెలువడుతున్నాయి.

ఏపీ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన మరికొద్ది గంటల్లోనే స్పీకర్ పై అవిశ్వాసం అంటూ అసెంబ్లీలో చర్చకు లేవనెత్తిన జగన్ ఎత్తుగడ అధికార పక్షం ముందు కుదేలయింది. దాదాపు మూడు, నాలుగు గంటల చర్చ తర్వాత ఓటింగ్ నిర్వహించిన డిప్యూటీ స్పీకర్ మండలి బుడ్డ ప్రసాద్, వైసీపీ ప్రవేశపెట్టిన స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం 47 ఓట్ల తేడాతో వీగిపోయిందని ప్రకటించారు.

వైసీపీ ప్రవేశపెట్టిన స్పీకర్ పై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఉన్నవారు లేచి నిలబడాలని డిప్యూటీ స్పీకర్ సూచన చేయగా… సభలో ఉన్న వైకాపా ఎమ్మెల్యేలు మొత్తం 57 మంది లేచి నిలుచున్నారు. ఆ తరువాత ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఉన్న వారిని లేచి నిలబడాలని సూచించగా తెలుగుదేశం, బీజేపీలకు చెందిన 97 మంది లేచి నిలబడ్డారు. తటస్థంగా ఉన్నవారు ఎవరూ లేకపోవడంతో స్పీకర్ ప్రకటన లాంచనమైంది. నిజానికి ఇది ముందుగానే ఊహించిన విషయం. అయితే అది తెలిసి కూడా ముందడుగు వేయడమే జగన్ విమర్శల పాలవ్వడానికి ప్రధాన కారణం.