Anni-Manchi-Sakunamuleస్వప్న సినిమా బ్యానర్ నుంచి ఒక ఫీల్ గుడ్ మూవీ వస్తోందంటే అంచనాలు సహజం. మండిపోయే వేసవిలో ఇప్పటికి దాకా వచ్చిన రెండు హిట్లు దసరా ఊర మాస్ కాగా విరూపాక్ష హారర్ థ్రిల్లర్. సగటు ఫ్యామిలీ ఆడియన్స్ కి రీచ్ అయ్యేది ఒక్కటి రాలేదు. అందుకే అన్నీ మంచి శకునములే  మీద సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. మహిళా దర్శకురాలు నందిని రెడ్డి, తెరనిండా కనిపించే సీనియర్ క్యాస్టింగ్, నిత్యం జనాలకు తెలిసేలా ప్రమోషన్లు ఒకటేమిటి పబ్లిసిటీ పరంగా ఏమేం చేయాలో అన్నీ జరిగాయి. సంతోష్ శోభన్ వరస ఫ్లాపుల్లో ఉన్నప్పటికీ అదేమీ ప్రతికూలాంశంగా మారలేదు.ఇంత హంగామా జరిగినప్పుడు కంటెంట్ బాగుంటుందనే నమ్మకమే అందరిదీ

కథ మరీ కొత్తదేం కాదు. విక్టోరియాపురం అనే ఊరిలో రెండు కుటుంబాలు. ఆస్తి గొడవ వల్ల ఇద్దరికీ పడదు. ఒకవైపు అన్నదమ్ములు రావు రమేష్, నరేష్ ల పెద్దరికం. మరోవైపు రాజేంద్రప్రసాద్ వ్యాపార సామ్రాజ్యం. వీళ్ళ పిల్లలే రిషి(సంతోష్ శోభన్) ఆర్య (మాళవిక నాయర్). పెద్దాళ్ళకుండే విభేదాలు ఈ జంటకు ఉండవు. కలిసి పెరుగుతారు. బిజినెస్ డీల్ కోసం యురప్ కూడా వెళ్తారు. ఇద్దరికీ చిన్నప్పుడే ఒక చిన్న ట్విస్టు ఉంటుంది. అది ఓ డాక్టర్(ఊర్వశి)కు మాత్రమే తెలుసు. క్లైమాక్స్ వచ్చేలోపు ఈ కుటుంబంలో జరిగే తీయని ఘర్షణే అసలు స్టోరీ. ఒక ఫీల్ గుడ్ మూవీకి సరిపడా లైన్ ఇది. సరిగ్గా రాసుకుని తగినంత మోతాదులో ఎంటర్ టైన్మెంట్ జొప్పిస్తే ఈజీగా పాసైపోవచ్చు

ఎమోషన్లతో కామెడీని మిక్స్ చేయడం ఒక కళ. కలిసుందాం రా, నువ్వు లేక నేను లేను, నిన్నే పెళ్లాడతా అంతగా హిట్టవడానికి కారణం ఇదే. ఈ శకునములేలో నందిని రెడ్డి అలాంటి ప్రయత్నమే చేయబోయారు. కలిసుండాల్సిన ఇద్దరు వ్యక్తులు ఆస్తి కోసం దూరమైతే వాళ్ళ పిల్లలు ఆ బంధం కలిసేందుకు కారణం ఎన్ని సినిమాల్లో చూశామో లెక్కబెట్టడం కష్టం. అయినా సరే తన బలమైన హాస్యాన్ని, భావోద్వేగాన్ని ఈసారి బలహీనతగా మార్చుకున్న నందినిరెడ్డి దీన్నో కంప్లీట్ ఎంటర్ టైనర్ గా మార్చడంలో తడబడ్డారు. సన్నివేశాలు వస్తుంటాయి పోతుంటాయి. ఏవీ విసిగించవు. అలా అని గుర్తుండవు. ఏదో మొక్కుబడిగా వెళ్తున్న ఫీలింగ్ వెంటాడుతూనే ఉంటుంది

ఇంటర్వెల్ వరకు ఏదోలా నెట్టుకొచ్చినా ఇటలీ ఎపిసోడ్ నుంచి గ్రాఫ్ ని ఎలా పైకి తీసుకెళ్ళలో అర్థం కాని కన్ఫ్యూజన్ లో ఏ పాత్ర ఎందుకలా ప్రవరిస్తుందో అర్థం చేసుకునే లోపే క్లైమాక్స్ వచ్చేస్తుంది. అక్కడ సెంటిమెంట్ ఎంతో కొంత వర్కౌట్ అయినా అప్పటికీ జరిగిపోయిన  నష్టం సినిమా బాగుందనే మాటకు అడ్డం పడతాయి. కొన్ని సీన్లలో డ్రామా ఎక్కువైపోయి కృత్రిమంగా వచ్చాయి. ముఖ్యంగా హృద్యంగా పండాల్సిన పెళ్లి ఎపిసోడ్ జంధ్యాల స్టైల్ కి త్రివిక్రమ్ బాణికి మధ్యలో నలిగిపోయి నందినిరెడ్డి ఒరిజినల్ శైలిని మిస్ చేసింది. దీని వల్ల అరె భలే చూపించారని చప్పట్లు కొట్టించాల్సిన సీన్లు ఖరీదయిన గ్లాసులో కాషాయంలా అనిపిస్తాయి

క్యాస్టింగ్ మొత్తం రిచ్ గా ఉంది. భారీ రెమ్యునరేషన్లు తీసుకునే ఆర్టిస్టులను పెట్టారు. చిన్న సీన్లకు సైతం ఝాన్సీ, తాగుబోతు రమేష్ లాంటోళ్లు అవసరం పడ్డారు. సంతోష్ శోభన్ ఎప్పటిలాగే చురుగ్గా ఉన్నాడు. మాళవిక నాయర్ మైనస్ కాదు కానీ మరీ గొప్ప ప్లస్సని కూడా అనిపించుకోలేదు. ఇలాంటి సినిమాలకు ఆడియో చాలా కీలకం. మిక్కీ జె మేయర్ ఎలాంటి ప్రభావం చూపలేదు. ఏ పాటా రిజిస్టర్ కాదు. సాంకేతిక బృందం కష్టం కనిపిస్తుంది. తెరమీద కంటెంట్ వేగంగా పరుగులు పెట్టాలని కోరుకుంటున్న ట్రెండ్ లో ఇలా నెమ్మదిగా సాగుతూ సీరియల్ తరహా మేకింగ్ తో థియేటర్ ఆడియన్స్ ని మెప్పించడం అంత సులభం కాదు.