Anna Canteen Demolished in Kuppamఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను మూసివేయించింది.. కారణం అవి టిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేసినవి కావడమే. వాటిలో అనేక అక్రమాలు జరగడం వలననే మూసేశామని సమర్దించుకొంది.

ఇప్పుడు తమ ప్రభుత్వమే అధికారంలో ఉంది కనుక వాటి పేరు మార్చి వైఎస్సార్ క్యాంటీన్లనో లేదా జగనన్న క్యాంటీన్లగానో నడిపించవచ్చు. ఒకవేళ అక్రమాలు జరిగి ఉండి ఉంటే ఎలాగూ ‘రివర్స్ టెండరింగ్’ విధానం కనిపెట్టారు కనుక దాంతో అక్రమాలన్నీ నివారించేయవచ్చు. కానీ ‘అమ్మ అన్నం పెట్టదు మరొకరిని పెట్టనీయదు’ అన్నట్లు వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను పెట్టదు. టిడిపి నేతలని పెట్టనీయకుండా అడ్డుపడుతోంది.

ఎందుకంటే అన్నా క్యాంటీన్లతో టిడిపికి ప్రజలలో మంచి పేరు వచ్చేస్తుందనే భయంతో! వాటితో మంచి పేరు వస్తుందనే నమ్మకం ఉంటే వైసీపీ నేతలే తమ జగనన్న పేరుతో క్యాంటీన్లను పెట్టి నడిపించుకోవచ్చు కదా?ఒకవేళ వాటితో మంచిపేరు వచ్చి మళ్ళీ గెలిచి అధికారంలోకి వస్తే సరేసరి లేకుంటే ఆ క్యాంటీన్లు నడిపిన అనుభవంతో హోటల్స్ పెట్టుకొని బ్రతికేయవచ్చు కదా?

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల కుప్పంలో మూడు రోజులు పర్యటించినప్పుడు స్థానిక టిడిపి నేత ఒకరు అన్నా క్యాంటీన్‌ ఏర్పాటు చేయగా దానిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసి ధ్వంసం చేశారు. అందుకు చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. అయినా అన్నా క్యాంటీన్‌పై దాడి చేసిన వైసీపీ కార్యకర్తలపై పోలీసులు ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దాంతో వారు మళ్ళీ చెలరేగిపోయారు.

కుప్పంలో టిడిపి మళ్ళీ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్‌ను సోమవారం రాత్రి ధ్వంసం చేశారు. దానికి అమర్చిన ఫ్లెక్సీ బ్యానర్లతో పాటు పట్టణంలోని ఆర్‌ అండ్ బీ గెస్ట్ హౌస్ వద్ద ఉన్న చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీ బ్యానర్‌ను కూడా చించివేశారు. దీంతో కుప్పం పట్టణంలో మళ్ళీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటిస్తున్నప్పుడు దమ్ముంటే సిఎం జగన్మోహన్ రెడ్డి లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనను ఎదుర్కోవడానికి రావాలని సవాల్ విసిరారు. దానికీ ఎవరూ స్పందించలేదు. కానీ పేద ప్రజల ఆకలి తీర్చడానికి టిడిపి ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లపై ఈవిదంగా ప్రతాపం చూపుతున్నారు. సిగ్గుచేటు!

Watch and subscribe for Exclusive Interviews: