anna canteen demolished in kadapa‘ప్రజావేదిక’తో మొదలైన జగన్ కూల్చీవేతల ‘పధకం’ నిర్విరామంగా కొనసాగుతూనే ఉందనడానికి నిలువెత్తు సాక్ష్యం… తాజాగా కడపలో ‘అన్న క్యాంటీన్’ కూల్చివేత ఘటన. టీడీపీ ప్రభుత్వ అధ్యర్యంలో నిర్మించిన ‘అన్న క్యాంటీన్’ను అర్ధరాత్రి సమయంలో నగర పాలక సంస్థ అధికారులు వచ్చి కూల్చివేయడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

పేదలకు 5 రూపాయలకే భోజన సదపాయాలు కల్పించి పేద వాడికి మూడు పూటల నాలుగు వేళ్ళు లోపలి వెళ్లాలనే ఉద్దేశంతో నాడు చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రమంతా నిర్మించారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే అన్న క్యాంటీన్లను ఎక్కడికక్కడ మూసేసి వాటిలో కొన్నింటినీ గ్రామ సచివాలయాలుగా మార్చిన ఉదంతం కళ్ళ ముందు కనపడే సత్యమే. మరికొన్ని ప్రదేశాలలో కరోనా సమయంలో ఈ క్యాంటీన్లను కోవిడ్ కేంద్రాలుగా కూడా వినియోగించింది.

కడపలో కూల్చివేసిన ‘అన్న క్యాంటీన్’ను టీడీపీ ప్రభుత్వ హయాంలో 30 లక్షల ప్రజా వ్యయంతో నిర్మించారు. క్యాంటీన్ తో పాటు లోపల ఉన్న విలువైన వస్తువులతో సహా నేల కూల్చటంతో స్థానికంగా అధికారులు తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. క్యాంటీన్ కూల్చివేత ఘటనతో అప్రమత్తమైన కడప ఇంచార్జ్ అమీర్ బాబు నేతృత్వంలో జరగడంతో, ఇది అధికార పార్టీ అహంకారానికి నిదర్శనం అంటూ నిరసన వ్యక్తంచేశారు టీడీపీ వర్గీయులు.

పెట్రోల్ బంకును ఏర్పాటు చేయడానికే అన్న క్యాంటీన్ ను కూల్చాల్సి వచ్చిందని కమీషనర్ రంగస్వామి తెలిపారు. బంకు నిర్మాణానికైతే ఖాళీ స్థలాలు చాలానే ఉన్నాయని, క్యాంటీన్ ను కూల్చడం అమానుషం అని ఆందోళన చేశారు స్థానికులు; టీడీపీ సభ్యులు.

ఈ కూల్చివేతల పర్వంలో వైసీపీ నాయకులు సాధించిందేమిటో తమకు చెప్పాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఇది ప్రజల డబ్బు, పన్నుల రూపంలో, ఇతరత్రా కొనుగోళ్ల రూపంలో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయంతో నిర్మించిన కట్టడాలను ప్రతిపక్ష పార్టీల మీద ఉన్న ద్వేషం కారణంగా కూల్చుకుంటూ పోతే రాష్ట్ర పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందనేది ప్రజల ఆవేదన.