Anisha-Ambrose-about-fashion-designer-son-of-ladies-tailorపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమా ద్వారా తెలుగు తెరకు ఎంట్రీ ఇవ్వాల్సిన అనీషా అంబ్రోస్, ఆ అవకాశాన్ని వదులుకుని, ‘మనమంతా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అందం, అభినయం కలగలిపిన అనీషా, జూన్ 2వ తేదీన విడుదల కాబోతున్న “ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్” సినిమా ద్వారా మరోసారి టాలీవుడ్ స్క్రీన్ పై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ ముద్దుగుమ్మ చెప్పిన సంగతులు.

గతంలో తాను నటించిన సినిమాలకు ఈ పాత్ర భిన్నంగా ఉంటుందని, కాస్త గ్లామరస్ గా, మోడ్రన్ లేడీలా కనపడతానని, ఒక విధంగా ఈ రోల్ లో చూసిన ప్రేక్షకులు ఖచ్చితంగా షాక్ అవుతారని తెలిపించి. అమెరికాలో పుట్టిపెరిగి, పల్లెటూరుకు వచ్చిన తాను ఎక్కువగా మోడ్రన్ కాస్ట్యూమ్స్ తో కనిపిస్తానని, అయితే చీరకట్టులో కనిపించాలనే తాపత్రయం కూడా ఎక్కువగా ఉంటుందని తన పాత్ర తీరుతెన్నుల గురించి చెప్పుకొచ్చింది. దర్శకుడు వంశీ గారు కావడంతోనే ఈ సినిమాను ఒప్పుకున్నానని, ఆయన దర్శకత్వంలో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది.

ఇక, ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ నుండి తాను తప్పుకోవడానికి పెద్ద కారణం ఏమీ లేదని, నిజానికి ఆ పాత్రలో నా కంటే కాజల్ అగర్వాల్ కే బాగా సూట్ అయ్యిందని, అయినా మొదటి సినిమానే పవన్ కళ్యాణ్ తో చేయడం అంటే నాపై బాగా ఒత్తిడి పెరిగిపోయింది, దానిని అధిగమించి ఆ సినిమాలో నటించలేనేమో అని తనంతట తానే తప్పుకున్నానని, అందుకు తానేమీ చింతించడం లేదని చెప్పింది అనీషా. అయితే ఎందుకు చింత… ఒక పరాజయం నుండి అనీషా తప్పుకున్నట్లే కదా… అంటున్నారు నెటిజన్లు.