Anil Ravipudi Interview With RRR teamప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 25వ తేదీన విడుదల కాబోతున్న “ఆర్ఆర్ఆర్” సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజాగా అనిల్ రావిపూడితో జక్కన్న – ఎన్టీఆర్ – రామ్ చరణ్ లు పాల్గొన్న ఇంటర్వ్యూను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ఎంతో ఆహ్లాదకరంగా అనిల్ రావిపూడి సినిమా మాదిరి నవ్వులు పూయించిన ఈ ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర అంశం తెలిసి వచ్చింది.

సెట్స్ లో ఉన్నపుడు రాజమౌళి తమను ఎలా నిలిపివేసే వారో, ఆ సాదకబాధకాలను చెప్పుకోవడానికి కూడా ఎవరూ ఉండేవారు కాదని జూనియర్ ఎన్టీఆర్ చెప్పగా, పక్కనే ఉన్న రామ్ చరణ్ – రాజమౌళిలు చిరుదరహాసంతో ఆనందించారు. మా బాధను చెప్పుకోవడానికి రాజమౌళి గారి చెవులు ఏమో పని చేయవని, ఇక మిగిలిన వల్లమ్మ, రమా (అమీన్)లు ఉండేవారని తెలిపారు.

రమా గారికి దగ్గరికి వెళితే, ‘అది పిచ్చి నాన్న, ఇంకా పెరుగుతూ పోతోంది నాన్న’ అని మాట్లాడుతుండగా, కార్తికేయ వచ్చి ‘ఆ రా’ అంటాడు, అమ్మా ఏంటమ్మా ఇప్పుడే నలిగిపోయాను అని తానంటే, ‘వెళ్లరా బంగారం.. త్వరగా అయిపోతుంది…’ నన్ను ‘బండ’ అంటుంది, ‘వెళ్లరా బండ, పో, ఆ పిచ్చోడుతో పనైపోతుందని’ అని చెప్పగానే, జూనియర్ ఎన్టీఆర్ మాటలకు నవ్వుకోవడం చరణ్, జక్కన్నలతో చూస్తున్న ప్రేక్షకుల వంతయ్యింది.

అసలు ఈ విషయంతో ఏ మాత్రం సంబంధం లేని కీరవాణి గారు వస్తారు, ‘చంపేస్తున్నారు సర్ జీ’ అని ఆయనకు చెప్పగానే, ‘నాకెందుకు చెప్తావు, నేను ఏమైనా చెప్తే వింటాడా’ అని కీరవాణి గారు తప్పించుకుంటారని, అన్ని తెలిసిన కార్తికేయకు చెప్దామనుకుంటే, ఇప్పుడు లైన్ ప్రొడ్యూసర్ అయిపోయాడని, తాను చెప్పడం ప్రారంభించగానే ‘ఫోన్ పట్టుకుని, ఒక్క నిముషం అన్న’ అని వెళ్ళిపోతాడని చెప్పి నవ్వులు పూయించారు అభిమానుల ‘బండ.’

జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానులు సహజంగా ఎన్టీఆర్, తారక్, జూనియర్, యంగ్ టైగర్ అంటూ అని ఎవరికీ తోచిన విధంగా వారు ముద్దుగా పిలిచుకుంటుంటారు. ఈ జాబితాలో భవిష్యత్తులో ‘బండ’ కూడా చేరుతుందేమో అనిపించే విధంగా నవ్వులు పూయిస్తూ చెప్పుకొచ్చారు నందమూరి తారక రామారావు.