anil ravipudi clarification to nandamuri fansనిన్న రాత్రి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ మెగా సూపర్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. చిరంజీవి చేతుల మీదుగా విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే నిన్న ఉదయం దర్శకుడు అనిల్ రావిపూడి రెండో సారి తండ్రయ్యాడు. దీనితో ఆయన ఆనందానికి అవధులు లేవు. అయితే రోజు చివరిలో ఆయనకు చిన్న షాక్ తగిలింది.

ఈవెంట్ లో ఆయన మాట్లాడుతుండగా సంక్రాంతి సినిమాలన్నిటికీ బెస్ట్ విషెస్ చెబుతూ కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా సంగతి మర్చిపోయారు. దీనితో నందమూరి అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. కారణం అనిల్ రావిపూడికి తన మొదటి సినిమా పటాస్ తో లైఫ్ ఇచ్చింది కళ్యాణ్ రామే. అటువంటిది ఆయననే మర్చిపోతావా అంటూ అనిల్ మీద నందమూరి అభిమానులు కన్నెర్రజేశారు.

దీనితో పొద్దునే ఆయన సంజాయిషీ చెప్పులోవాల్సి వచ్చింది. “వృత్తిపరంగా, వ్యక్తిగతంగా నిన్న నాకు చాలా ఎమోషనల్ డే. సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ వేడుకతో చాలా సంతోషానికి లోనయ్యాను. దీంతో నా మొదటి హీరో, నిర్మాత కల్యాణ్ రామ్ పేరును వేడుకలో చెప్పడం మర్చిపోయాను. అది ఉద్దేశపూర్వకంగా కాదు, నిజంగానే మర్చిపోయాను. ఎంతమంచి వాడువురా చిత్రం ఘనవిజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు.

దీనితో నందమూరి అభిమానులు శాంతిస్తారని అనుకుందాం. ఇది ఇలా ఉండగా సరిలేరు నీకెవ్వరూ ఈ నెల 11న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అవుతుంది. గత సంక్రాంతికి ఎఫ్2 తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న అనిల్ ఈ సంక్రాంతికి మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకోవాలని ఆరాటపడుతున్నాడు.