Anil-Kumble- resignation for Team India Coachప్రస్తుతం టీమిండియాలో ఏం జరుగుతోంది? ఇదే ప్రశ్న ప్రతి అభిమాని మదిలో మెదులుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ముందు నుండి ప్రారంభమైన రగడ, ఫైనల్లో కప్ ను చేజార్చుకునే వరకు వెళ్ళింది. అంతటితో ఆగని ఈ రచ్చ… ఏకంగా మీడియాకు కూడా ఎక్కింది. దీంతో కుంబ్లే – కోహ్లిల మధ్య అంతరాలు పుకార్లు కాదు, నిజమే అన్న విషయం స్పష్టమైంది. దీంతో తాజాగా తన హెడ్ కోచ్ పదవికి రిజైన్ చేస్తూ కుంబ్లే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ సందర్భంగా బీసీసీఐకు ఓ లేఖ రాస్తూ… అంతా వివరించారు.

గతేదాడి కాలంగా టీమిండియా హెడ్ కోచ్ గా సేవలందించానని, ఈ అవకాశాన్ని ఇచ్చిన బీసీసీఐకు కృతజ్ఞతలు తెలిపాడు కుంబ్లే. కోచ్ గా తన బాధ్యతలను నిర్వర్తించే క్రమంలో తనకు కెప్టెన్ కు మధ్య అభిప్రాయబేధాలు కలిగాయని, వీటిని పరిష్కరించేందుకు బీసీసీఐ సభ్యులు కూడా రంగంలోకి దిగారని, అయినప్పటికీ ఫలితం లేదని, దీంతో తన బాధ్యతల నుండి తప్పుకోవడమే టీమిండియాకు సముచితమైన నిర్ణయంగా భావించి తన హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేస్తున్నానని, ఎప్పటికీ ఇండియా శ్రేయోభిలాషినేనని భావోద్వేగంతో తెలిపారు.

కుంబ్లే వ్యవహారశైలి, నిబద్ధత, చిత్తశుద్ధి తెలిసిన వారు మాత్రం విరాట్ కోహ్లిపై మండిపడుతున్నారు. ప్రాక్టీస్ విషయంలో కుంబ్లే అనుసరిస్తున్న విధానాలతోనే కోహ్లి విబేధాలు తలెత్తినట్లుగా మొదట్లో వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ప్రస్తుత పరిస్థితులలో కెప్టెన్ గా విరాట్ కోహ్లిని తప్పించడం అసాధ్యం గనుక, టీమిండియా భవిష్యత్తు రీత్యా కుంబ్లేనే తనంతట తానుగా వెళ్ళిపోయాడు. ఓ రెండు సంబంధాల మధ్య అయినా ‘పార్టనర్ షిప్’ సరిగా లేకపోతే, అది ముందుకు సాగదని ఈ సందర్భంగా కుంబ్లే చెప్పిన విషయం అక్షర సత్యం.