Anil Kumar Yadav Vs Kakani Govardhan Reddyఇల్లాలకగానే పండగ కాదన్నట్లు మంత్రివర్గ విస్తరణ చేయగానే వైసీపీలో ‘మంత్రుల పండగ’ ముగిసిపోలేదు. నెల్లూరు జిల్లాకు చెందిన అనిల్ కుమార్‌ను మంత్రివర్గంలో నుంచి బయటకు సాగనంపి ఆయన స్థానంలో నెల్లూరు జిల్లాకే చెందిన కాకాణి గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టడంతో వారి మద్య కుమ్ములాటలు మొదలయ్యాయి.

నిజానికి అనిల్ కుమార్‌ తాను మంత్రిగా ఉన్నప్పుడే కాకణి తనకు సహాయ నిరాకరణ చేస్తూ చాలా ఇబ్బంది పెట్టేవారని, అందుకే ఇప్పుడు వాటికి డబుల్ చేస్తానని అనిల్ కుమార్‌ బాహాటంగానే చెప్పారు. చెప్పినట్లుగానే కాకాణి మంత్రి పదవి చేపట్టి జిల్లాకు వస్తుంటే ఆయనకు పోటీగా ఆత్మీయసభ పెట్టి సవాల్ విసిరారు. అది సరిపోదన్నట్లు మంత్రి కాకణికి స్వాగతం చెపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బ్యానర్లను అనిల్ కుమార్‌ వర్గీయులు చించేయడంతో కాకణి చిర్రెత్తిపోయారు.

జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు ఒకరి తరువాత మరొకరికి మంత్రి పదవులు ఇస్తే, వాళ్ళలో వాళ్ళే కుమ్ములాడుకోవడం చూసి సిఎం జగన్మోహన్ రెడ్డి చాలా ఆగ్రహంగా ఉన్నారు. బుదవారం మధ్యాహ్నం 3 గంటలకు వారిద్దరినీ తాడేపల్లి సిఎం క్యాంప్ కార్యాలయానికి రావాలని సీఏంవో నుంచి ఫోన్లు వెళ్ళాయి.

సిఎం జగన్మోహన్ రెడ్డి వారికి నయన్నో భయాన్నో నచ్చేజెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవన్నట్లు వారి మద్య రాజకీయ శతృత్వం, ఆధిపత్యపోరును సిఎం జగన్మోహన్ రెడ్డి మంత్రదండం తిప్పి మాయం చేయలేరు కదా?

ఒకవేళ స్వయంగా హెచ్చరించినప్పటికీ లొంగకపోతే అప్పుడు జగన్ ఏమి చేస్తారు?అంటే అనిల్ కుమార్‌ను ఎలాగూ క్యాబినెట్ నుంచి బయటకు పంపించారు కనుక మాట వినకపోతే పార్టీ నుంచి కూడా బయటకు పంపిస్తారేమో?ఈ విషయం రాజకీయాలలో రాటుతేలిన అనిల్ కుమార్‌కు తెలియదనుకోలేము. కనుక సిఎం జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చిన తరువాత తగ్గుతారా లేక తగ్గేదేలే…అంటారో చూడాలి.