andrea jeremiahసినీ ఇండస్ట్రీలోని వ్యవహార తీరుపై ఇప్పటికే చాలా మంది ముద్దుగుమ్మలు తమ తమ భావాలను వ్యక్తపరిచిన విషయం తెలిసిందే. ‘మేల్ డామినేషన్ ఇండస్ట్రీ’గా టాక్ సంపాదించుకున్న సినీ పరిశ్రమలో హీరోయిన్లు ఎవరైనా ఎదగాలంటే… హీరోల పక్కన ప్రాధాన్యత లేని రోల్స్ చేసి తైతక్కలాడాలని, అప్పుడే వారికి గుర్తింపు లభిస్తుందని ‘యుగానికొక్కడు’ సినిమా ద్వారా పరిచయం అయిన ఆండ్రియా, మహిళా దినోత్సవం సందర్భంగా పాల్గొన్న ఓ ఈవెంట్ లో విమర్శల వర్షం కురిపించింది.

తాను ‘తారామణి’ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదని, అదే విజయ్ సరసన నాలుగు పాటల్లో డ్యాన్స్ చేసే హీరోయిన్ అయితే ‘ఫట్ ఫట్ ఫట్ మని’ అవకాశాలు వచ్చేస్తాయని, ఏ హీరోయిన్ అయినా షారుఖ్, సల్మాన్, రజనీ, అజిత్, విజయ్ వంటి హీరోల సరసన చేస్తేనే గుర్తింపు వస్తుందని, చివరికి బాలీవుడ్ లో దీపికా అయినా ముందుగా షారుఖ్ పక్కన నటించడం వలనే దీపికా పదుకునేగా మారిందని ఆవేశంగా ప్రసంగించింది.

అలాగే నయనతార కూడా రజనీ, విజయ్, సూర్య వంటి హీరోల సరసన నటించిన తర్వాతే గుర్తింపు లభించిందని, ఒక మామూలు ఆండ్రియా, స్టార్ హీరోయిన్ ఆండ్రియాగా ఎందుకు రాలేకపోతోందని, ఇదే తన ఆవేదనగా చెప్పుకొచ్చింది. నడుము ఉపుతూ, ఎక్స్ పోజింగ్ చేసే డ్రెస్ లు వేసుకోమని ఆఫర్లు వస్తే తాను చేయబోనని, అవసరమైతే తాను నగ్నంగా నటించడానికి కూడా సిద్ధం కానీ, అది పాత్రకు అనుగుణంగా ఉండాలని అంటూ ‘మేల్ డామినేషన్’ ఇండస్ట్రీపై విమర్శల జడివాన కురిపించింది.