andhra-telangana-bifurcation-issues-meet-in-delhiరాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్ళు అయినా నేటికీ రెండు తెలుగు రాష్ట్రాల మద్య విభజన సమస్యలు పరిష్కరించుకోలేకపోయాయి. రెండు పిల్లులు రొట్టె ముక్క కోసం కీచులాడుకొంటే, కోతి పంచాయతీ చేసి ఆ రొట్టె మొత్తం తినేసినట్లు రెండు తెలుగు రాష్ట్రాల కోట్లాటకు కేంద్ర ప్రభుత్వం నిన్న ఢిల్లీలో పంచాయతీ నిర్వహించింది. ఆ సమావేశంలో కూడా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగినా సమావేశం చాలా సంతృప్తికరంగా జరిగిందని ఏపీ అధికారులు చెప్పడం దిగ్బ్రాంతి కలిగిస్తుంది.

వైసీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా అంగీకరించడం లేదు కనుక అక్కడ నిర్మాణ పనులు నిలిపివేసింది. కానీ అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న దానిలో మిగిలిన రూ.1,000 కోట్లు ఇవ్వాలని కోరగా, ముందు ఇచ్చిన రూ.1500 కోట్లకు లెక్కలు చెప్పమని కేంద్రం నిలదీసింది. అయినా సిగ్గుపడకుండా రాజధాని నిర్మాణం కోసం శివరామకృష్ణన్ కమిటీ రూ.29 వేల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పింది కనుక ఆ సొమ్ము అయినా ఇవ్వాలని ఏపీ అధికారులు అడిగితే కేంద్రం పట్టించుకోలేదు.

Also Read – చంద్రబాబు ఇంత శక్తివంతుడా? థాంక్స్ వైసీపి!

ఏపీలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం నిధులు ఇవ్వాలని ఏపీ అధికారులు కోరగా నీతి ఆయోగ్ కేవలం 5 ఏళ్ళ వరకే ఇమ్మనమని చెప్పిందని కనుక కొత్తగా ఇవ్వలేమని తేల్చి చెప్పడమే కాకుండా, దీనికోసం ఇదివరకు విడుదల చేసిన రూ.1750 కోట్లలో ఏపీ ప్రభుత్వం రూ.1,049 కోట్లకే లెక్కలు అప్పజెప్పిందని, మిగిలిన రూ. 701 కోట్లకు లెక్కలు చెప్పాలని కేంద్రం నిలదీసింది.

పన్ను రిఫండ్‌లు, పన్ను బకాయిల విషయంలో విభజన చట్టంలో లోపాలవలన పన్ను రిఫండ్‌లు తెలంగాణకి వెళుతుండగా, బకాయిలు ఏపీ ప్రభుత్వం చెల్లించవలసివస్తోందని, కనుక ఆ చట్టంలో లోపాలను సవరించాలని ఏపీ అధికారులు కోరగా, దానిపై కూడా తెలంగాణ అధికారులు తీవ్రంగా అభ్యంతరం తెలిపి అడ్డుకొన్నారు.

Also Read – హైద్రాబాద్ పై ఉమ్మడి హక్కు కు కాలం చెల్లనుందా..?

రాష్ట్ర విభజన చట్టంలో విశాఖలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేస్తామనే హామీ కూడా ఉంది. దాని కోసం అడిగితే ‘అది లాభదాయకం కాదు కనుక ఏర్పాటు చేయలేమని’ రైల్వే అధికారులు కుండబద్దలు కొట్టినట్లు స్పష్టంగా చెప్పారు. “అది లాభదాయకమా కాదా అని కాదు… చట్టంలో ఇచ్చిన హామీని ఎందుకు అమలుచేయడం లేదు?” అని ఏపీ అధికారులు నిలదీయడంతో ఈ విషయం క్యాబినెట్ సబ్ కమిటీ చూసుకొంటుందని పక్కన పెట్టేశారు.

షెడ్యూల్ 9,10లోకి వచ్చే ఏపీఎస్ఎఫ్‌సీ ఆస్తుల పంపకాల విషయంలో తెలంగాణ అధికారులు ధాటిగా వాదిస్తూ ఏపీ అధికారుల ప్రతీ వాదనపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. చివరికి తేలిందేమిటంటే, వాటిలో ఏ ఒక్క దానిని వదులుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా లేదని! తెలంగాణ నుంచి ఏపీకి డమ్మీడీ రాదని!

Also Read – కేసీఆర్‌ ట్రాప్‌లో రేవంత్‌ రెడ్డి పడ్డారా?

ఇక రెండు రాష్ట్రాల మద్య అప్పుల విషయంలో కూడా తెలంగాణ అధికారులు ధాటిగా వాదిస్తూ ఏపీ అధికారులను కట్టడి చేశారు. కనుక తెలంగాణ ప్రభుత్వం ఏపీకి చెల్లించవలసిన బకాయిలు కూడా రావని స్పష్టం అయిపోయింది.

ఈ ఢిల్లీ పంచాయతీలో ఓ వైపు కేంద్ర ప్రభుత్వం ఏపీకి మొండి చెయ్యి చూపగా, మరోవైపు తెలంగాణ అధికారులు తమ రాష్ట్రానికి ఏమాత్రం నష్టం జరగకుండా అటు కేంద్రాన్ని, ఇటు ఏపీ అధికారులను కూడా ధీటుగా అడ్డుకొన్నారు. కనుక ఈ పిల్లి పంచాయతీలో ఏపీకి కొత్తగా ఓరిగిందేమీ లేదు పరువు పోగొట్టుకోవడం తప్ప. అయినా సమావేశం సంతృప్తికరంగా సాగిందట!