YCP_MP_Raghu_Rama_Krishna_Rajuవచ్చే నెల 4వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించి, స్వాతంత్ర సమారోయయోధుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి వేడుకలలో పాల్గొనబోతున్నారు. కనుక నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరావు తాను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు ప్రకటించారు. గత కొంతకాలం ఢిల్లీలో ఉంటున్న ఆయన రాష్ట్రాని వస్తే అరెస్ట్ చేస్తామని జగన్ ప్రభుత్వం హెచ్చరిస్తుండటాన్ని ఆయన తప్పు పట్టారు.

ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “అక్రమాస్తుల కేసులో బెయిల్‌పై బయట ఉన్న సిఎం జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళవచ్చు కానీ ఎంపీనైన నేను నా నియోజకవర్గంలో అడుగు పెట్టడానికి వీలులేదా?ఇదెక్కడి న్యాయం? నేను ఏపీలో అడుగు పెట్టగానే పోలీసులు అరెస్ట్ చేస్తారని నా సహచర ఎంపీలు చెప్పారు.

‘లా జస్టిస్‌ అండ్‌ పబ్లిక్‌ గ్రీవెన్స్‌ కమిటీ’లో సభ్యుడిగా ఉన్న నేను విశాఖలో జరుగబోయే కమిటీ సమావేశానికి హాజరైతే నన్ను అరెస్ట్ చేస్తామని కనుక సమావేశాన్ని వాయిదా వేసుకోవాలని లేదా నేను లేకుండానే నిర్వహించుకోవాలని పోలీసులు కమిటీ సభ్యులకు చెప్పారు.

ప్రధాని నరేంద్రమోడీ నా జిల్లాలో ఓ కార్యక్రమానికి హాజరవుతున్నపుడు ప్రోటోకాల్ ప్రకారం నేను కూడా హాజరుకావలసి ఉంటుంది. కనుక జగన్ ప్రభుత్వం నన్ను అడ్డుకొని అరెస్ట్ చేస్తే అది నా హక్కులకు భంగం కలిగించినట్లవుతుంది. కనుక నేను లోక్‌సభ స్పీకరుకి ఫిర్యాదు చేస్తాను. అవసరమైతే న్యాయపోరాటం కూడా చేస్తాను. నాకు నా హక్కులను ఏవిదంగా కాపాడుకోవాలో బాగా తెలుసు.

జగన్ ప్రభుత్వం ఎన్ని అవరోధాలు సృష్టించినా నేను తప్పకుండా భీమవరానికి వస్తాను. ప్రధాని నరేంద్రమోడీ కార్యక్రమంలో నేను కూడా పాల్గొంటాను. ఆ తరువాత జగన్ ప్రభుత్వంనాపై ఎన్ని కేసులు పెట్టుకొన్నా ఎదుర్కొనేందుకు నేను సిద్దమే,” అని రఘురామకృష్ణ రావు అన్నారు.