Vundavalli-Sridevi-YCP-MLAతాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి తుళ్లూరులో వెంకన్న సాక్షిగా నిరసన సెగ తగిలింది. తుళ్లూరు మండలం అనంతవరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్యర్యంలో జరిగిన శ్రీదేవి భూదేవి సామెత వేంకటేశ్వరస్వామి వారి శాంతి కళ్యాణంలో పాల్గొని ఉండవల్లి శ్రీదేవి పట్టువస్త్రాలు సమర్పించారు. అక్కడికి విచ్చేసిన మహిళలు ‘గో బ్యాక్ శ్రీదేవి’ అంటూ నినాదాలు చేశారు.

మీరెవరు., ఇక్కడికి మీరెందుకు వచ్చారు., “న్యాయస్థానాలే మాకు దేవస్థానాలు, న్యాయమూర్తులే మాకు దేవుళ్ళు” అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఇన్ని రోజులుగా మేము రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేస్తున్నా కనీసం వచ్చి చూసారా? ఇందుకేనా మేము ఓట్లు వేసి మిమ్మల్ని., మీ పార్టీని గెలిపించింది అంటూ వైసీపీ తీరుని ప్రశ్నించారు.

“బిల్డ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్” అనే నినాదంతో ఏపీ ప్రజలంతా ముందుకు వస్తేనే ఈ ప్రభుత్వ పెద్దల మెడలు వంచి ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పధంలో ఉంచగలమని అమరావతి మహిళలు తమ ఆక్రోశాన్ని ఏపీ ప్రజల ముందుంచారు. ఏ హక్కుతో స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిందో శ్రీదేవి చెప్పాలని స్థానికులు పట్టుబట్టారు.

ఈ ప్రాంత అభివృద్ధిని నాశనం చేసేసి, రాజధాని నిర్మాణంలో భాగంగా ఒక్క ఇటుకైనా వేసారా మీ ప్రభుత్వంలో అంటూ నిలదీశారు రాజధాని గ్రామస్తులు. ఏది ఏమైనప్పటికి రాజధాని మహిళలు ఎంచుకున్న “బిల్డ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్” నినాదం భావితర భవిషత్ కు బాటలు వేస్తుందనే సత్యాన్ని వైసీపీ ప్రభుత్వం ఎంత తొందరగా అర్ధం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అంత తొందరగా మెరుగవుతుందని ఆశించడం రాజధాని వాసుల వంతవుతోంది.

‘కాలం ఎల్లప్పుడూ ఒకరి వైపే ఉండదు’ మాకు టైం వస్తుంది అప్పుడు చూపిస్తాం మేమేం చేయగలమో అని తదుపరి ఎన్నికలపై పరోక్షంగా వైసీపీ నేతలకు రాజధాని వాసులు హెచ్చరికలు పంపుతున్నారు.