AP CM YS Jagan Mohan Reddyకలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడని, ఆ కొడుకే మన అందరి జగనన్న అని వైసీపీ నేతలు గర్వంగా చెప్పుకొంటుంటారు. జగనన్న పాదయాత్రలు చేసి నడిచొచ్చిన మాట నిజమే కానీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఏమీ కలిసి రాలేదని పైగా ఈ మూడేళ్ళలో పాలనలో రాష్ట్రం మరో 20 సం.లు వెనక్కి వెళ్ళిపోయిందని, మరో 20 సం.లు శ్రమిస్తే గానీ మళ్ళీ పూర్వస్థితికి చేరుకోలేదని ప్రతిపక్షాల వాదన.

వాటి వాదోపవాదాలను పక్కన పెడితే గత ఎన్నికలలో టిడిపి వ్యతిరేక శక్తులన్నీ ఏకమవడం, అదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి అన్నీ కలిసిరావడంతో ఓడలు బళ్ళు అయ్యాయని చెప్పుకోవచ్చు. టిడిపి ఓటమికి, వైసీపీ గెలుపుకి గల ఈ కారణాలన్నీ ప్రజలకు తెలిసినవే. వాటిలో ప్రశాంత్ కిషోర్‌ సేవలు, ఆయన వ్యూహరచన కూడా ఒకటని కూడా అందరికీ తెలుసు.

రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, మారుతున్న సమీకరణాలు, బలాబలాలు, ప్రజాభిప్రాయం వంటివన్నీ పరిగణనలోకి తీసుకొని చూస్తే వచ్చే ఎన్నికలలో వైసీపీకి 2019లో ఉన్నంత సానుకూల వాతావరణం ఏమాత్రం ఉండకపోగా ఎదురీదవలసి రావచ్చని అర్దమవుతూనే ఉంది.

ఈవిషయం సిఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే గ్రహించినట్లున్నారు. అందుకే ఎన్నికలకి ఇంకా రెండేళ్ళ సమయం ఉండగానే ఇప్పటి నుంచే ఎన్నికల భేరీ మోగించేశారు. త్వరలోనే తాను జిల్లాల యాత్రలు చేస్తానని చెప్పడమే కాకుండా మే 10 నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ‘గడప గడపకు వైసీపీ’ కార్యక్రమంలో భాగంగా ప్రజలలోకి వెళ్లాలని గట్టిగా చెప్పారు.

వచ్చే ఎన్నికలలో పరిస్థితులు తారుమారయ్యే సూచనలు కనిపిస్తున్నప్పుడు మరి ప్రశాంత్ కిషోర్‌ సేవలు ఎందుకు వద్దనుకొన్నారో తెలియదు కానీ వద్దనుకొన్నామని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించేశారు. బహుశః తమ సంక్షేమ పధకాలే తమను ఒడ్డున పడేస్తాయని సిఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారేమో? అందుకే ఈ పరిస్థితులలో కూడా 150 సీట్లు గెలుచుకోవడం గురించి మాట్లాడుతున్నట్లున్నారు.

అయితే ఆ సంక్షేమ పధకాల కారణంగానే రాష్ట్రానికి ఈ దుస్థితి పట్టిందని, తాము ఆ అదనపు భారం మోయవలసి వస్తోందని, కనుక వచ్చే ఎన్నికలలో వాటికి ఫుల్ స్టాప్ పెట్టక తప్పదని రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు అనుకొంటున్న సంగతి సిఎం జగన్మోహన్ రెడ్డికి మరి తెలుసో తెలియదో?ఒకవేళ ఆయనకు తెలియకపోయుంటే, లక్షల రూపాయలు జీతాలు ఇచ్చి పెట్టుకొన్న ప్రభుత్వ సలహాదారులలైనా ఈ విషయం ఆయన చెవిన వేసి ప్రశాంత్ కిషోర్‌ సేవలు అవసరమని గట్టిగా చెప్పి ఉండాలి కదా? కానీ పిల్లి మెడలో గంటెవరు కడతారన్నట్లు అందరూ మౌనంగా ఉండిపోయినట్లున్నారు.

నిజానికి గత ఎన్నికలలో ప్రశాంత్ కిషోర్‌ లేకపోయినా వైసీపీ గెలిచి ఉండేదేమో కానీ వచ్చే ఎన్నికలలో మాత్రం తప్పనిసరిగా వైసీపీకి ప్రశాంత్ కిషోర్‌ అవసరం చాలా ఉందని చెప్పవచ్చు. కానీ లేదనుకొంటే ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అని సర్దిచెప్పుకోవలసిందే.