YSR-Congress-Party Andhra Pradeshవిజయనగరం జిల్లా, నెల్లిమర్లలో రామతీర్దం పక్కనే ఉన్న బోడికొండపై ఉన్న ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ఏడాదిన్నర క్రితం కొందరు దుండగులు కూల్చివేయడంపై ఆనాడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తదనంతరం మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు, టిడిపి నేతలు అక్కడికి వెళ్లినప్పుడు ఓ వైసీపీ మంత్రి, నేతలు వారిని దుర్భాషలాడటం వంటి అనుచిత పరిణామాలు కూడా జరిగాయి.

ఎంతో ప్రసిద్ధి చెందిన రామతీర్దం పుణ్యక్షేత్రంలో రాముడి విగ్రహం ధ్వంసం కావడం, దానిపై ప్రతిపక్షాలు ఆందోళనలు చేయడంతో ప్రజాగ్రహానికి గురి కావలసివస్తుందనే భయంతో రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా రూ.3 కోట్లు వ్యయంతో పాత ఆలయం ఉన్నచోట కొత్తగా రాతిఆలయం నిర్మించింది. సోమవారం ఉదయం ఆ ఆలయంలో శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండ రామస్వామివార్లను పునఃప్రతిష్టించారు. మంచిదే. చాలా సంతోషం.

అయితే గత రెండేళ్ళుగా రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసాలు, ఆలయాలలో దొంగతనాలు, రధాలకు నిప్పు పెట్టడాలు, పుణ్యక్షేత్రాలలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు?నేటికీ విగ్రహాలను ధ్వంసం చేసినవారిని పోలీసులు ఎందుకు పట్టుకోలేపోయారు?అంటే చిత్తశుద్ధి లేకపోవడం వలననే అనుకోవలసి ఉంటుంది. అయితే రాష్ట్రంలో బిజెపి హిందువులను ఆకట్టుకొనేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నందున, దానికి ఆ అవకాశం కల్పించకూడదనే వైసీపీ ప్రభుత్వం హడావుడిగా ఈ నిర్మాణం పూర్తి చేసిందా?అంటే అవుననే అనుకోవలసి ఉంటుంది.

హిందువుల పుణ్యక్షేత్రాలను, వాటితో ముడిపడున్న వారి మనోభావాలను గౌరవించకుండా వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తుండటం వలననే ప్రభుత్వం ఈవిదంగా వ్యవహరిస్తోందని భావించవచ్చు. ఈ వాదన సరికాదనుకొంటే ఇక నుంచైనా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఆలయాలన్నిటి భద్రతకు పూర్తి బాధ్యత వహించాలి. ముఖ్యంగా తిరుమల, శ్రీకాళహస్తి, విజయవాడ కనకదుర్గమ్మ, రామతీర్ధాలు, అరసవెల్లి వంటి పుణ్యక్షేత్రాలలో రాజకీయాలు చొప్పించకుండా వాటి ఆధ్యాత్మికతను కాపాడాలి.

ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో దేవాదాయ, పర్యాటకశాఖ మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన కొట్టు సత్యనారాయణ, ఆర్‌కె రోజాలు ఓ విషయం గమనించాలి. ఏపీలో గత రెండున్నరేళ్ళుగా పారిశ్రామికాభివృద్ధి జరగడం లేదు. రాష్ట్రానికి ప్రధాన ఆదాయవనరులలో పర్యాటకం కూడా ఒకటి. పర్యాటకంలో పుణ్యక్షేత్రాలు కూడా భాగమే. దేశంలో తమిళనాడు తరువాత మరే రాష్ట్రానికి లేనన్ని పుణ్యక్షేత్రాలు, ప్రసిద్ద ఆలయాలు ఏపీలో మాత్రమే ఉన్నాయి. అటు చిత్తూరు, నెల్లూరు నుంచి ఇటు శ్రీకాకుళం వరకు రాష్ట్రంలో అనేకకానేక సుప్రసిద్ద పుణ్యక్షేత్రాలు, దేవాలయాలను ప్రభుత్వం అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదు కానీ వాటికి నష్టం కలగకుండా కాపాడుకొంటే చాలు. ఆలయాలలో దొంగతనాలు, విగ్రహాల ధ్వంసం, అసాంఘిక కార్యక్రమాలు జరుగకుండా కాపాడగలిగితే చాలు. భక్తులూ సంతోషిస్తారు. ఓటర్లు సంతోషిస్తారు. వీలైతే భక్తులకు కాస్త సౌకర్యాలు కల్పిస్తే పర్యాకం ద్వారా రాష్ట్రానికి ఎంతో కొంత ఆదాయం కూడా వస్తుంది.