Raghu Rama Krishna Rajuపార్లమెంట్ వేదికగా తనను అత్యంత అసభ్య పదజాలంతో వైసీపీ ఎంపీ నందిగం సురేష్ దూషించారంటూ చెప్పిన రఘురామ కృష్ణంరాజు, తాజాగా మరో బాంబ్ పేల్చారు. ఈ సారి ఏకంగా తనను మర్డర్ చేస్తానంటూ బెదిరించినట్లుగా రాజు గారు తెలిపారు.

తాను ఎప్పుడూ గేట్ నెంబర్ 4 నుండి ప్రవేశిస్తానని, తన కోసం కాపు కాసాడో లేక యాదృశ్చికంగా అక్కడ ఉన్నారో గానీ, తనను చూసిన వెంటనే హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ ‘హేయ్… నిన్ను మర్డర్ చేసి పడ దె….. నా …..’ అంటూ బెదిరించారని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు.

తనను ‘ల…’ బూతుతో తిట్టిన నందిగం సురేష్ ని ప్రత్యేకంగా పులివెందుల ఎమ్మెల్యే, మన ముఖ్యమంత్రి ఎంతో సంతోషించినట్లుగా, సదరు ఎంపీని అభినందించినట్లుగా సమాచారం అందిందని, ఇంత మంచి “సంస్కారం” ఉన్న పార్టీలో బూతులు కాకపోతే ఇంకేమి వస్తాయి, ఇపుడు మర్డర్ చేస్తా అన్న వాడిని మెచ్చుకుంటాడేమో చూడాలి అన్నారు.

అయితే తనకు లభించిన సమాచారం మేరకు గోరంట్ల మాధవ్ తన భార్యను హత్య చేసినట్లు కేసు ఉందని, తన భార్యను ఎంత ఈజీగా చంపారో, నన్ను కూడా అంతే తేలికగా చంపేద్దాం అనుకుంటున్నారేమో, అది సాధ్యం కాదని, ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం గోరంట్ల మాధవ్ ప్రాణాలకే ముప్పు ఉందని హెచ్చరించారు.

ఆవేశపరుడైన గోరంట్ల మాధవ్ ని తప్పించి, దానిని తన పైన రుద్దడానికి ప్లానింగ్ జరుగుతున్నట్లుగా రఘురామ ఆరోపణలు చేసారు. తనకు ‘వై’ క్యాటగిరి సెక్యూరిటీ ఉందని, తనను తాను రక్షించుకోగలనని, గోరంట్ల అనుక్షణం జాగ్రత్తగా ఉండాలని రాజు గారు సూచించారు.

వివేకానందరెడ్డి గారి మర్డర్ ఎవరు చేసారో త్వరలో తెలియవచ్చు, దానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయని, అది సాక్ష్యాలు మార్చే ప్రక్రియ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అలాంటి వారి నుండి గోరంట్ల మాధవ్ ప్రాణాలకు ముప్పు ఉండొచ్చని అన్నారు.

గోరంట్ల అన్నది సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యిందని, ఆడియో వినిపించకపోయినా, తనను బెదిరించిన వైనం వీడియోలో ఉంటుందని అన్న రఘురామ, దీనిపై ఇప్పటికే ప్రధానమంత్రి గారికి ఓ లేఖ రాసినట్లుగా సదరు లేఖను మీడియాకు చూపించారు.

“మిస్టర్ జగన్ మోహన్ రెడ్డి… నేరుగా నిన్నే అడుగుతున్నాను… ఆ బూతులన్నీ వాళ్ళు అన్నారా? నువ్వు అనిపించావా?” అని ప్రశ్నించారు. ‘ఫిష్ ఆంధ్ర’గా మొదలైన స్కీమ్స్ ‘ఫినిష్ ఆంధ్ర’ వైపుగా వెళ్తోందని, త్వరలో 7 లక్షల కోట్ల అప్పుతో ఆంధ్రప్రదేశ్ ఫినిష్ అవుతుందని అన్నారు.