Chiranjeevi and Perni Naniపవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడానికి మెగాస్టార్ చిరంజీవిని ఒక ఆయుధంగా వినియోగించు కోవడం వైసీపీ నేతలకు పరిపాటిగా మారిపోయింది. జనసేన ఆవిర్భావ సభలో అందరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్, తన సోదరుడు చిరంజీవిని విస్మరించారని, ఈ రోజున పవన్ ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన చిరు పేరును కనీసం ప్రస్తావించలేదని పేర్ని నాని, అవంతి శ్రీనివాసరావు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు.

అయితే ఉన్నట్లుండి చిరంజీవిపై ఇంత ప్రేమ వైసీపీ నేతలకు పుట్టుకురావడమేంటని ‘ఫ్యాన్’ గుర్తు నాయకులపై మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సినీ పరిశ్రమను ఇబ్బందులకు గురిచేసి, తిరిగి పరిష్కరించడానికి తాడేపల్లి నివాసానికి చిరంజీవిని రప్పించుకుని ఇచ్చిన “గౌరవ మర్యాదలు” తెలియనివి కావులే అన్నది మెగా అభిమానుల ఆవేదన. ఇదే విషయాన్ని నేటి రచ్చబండలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా ప్రస్తావించారు.

చిరంజీవి చేత అంత వొంగి వొంగి దండాలు పెట్టించుకున్న తర్వాత కూడా జగన్ సర్కార్ మంజూరు చేసిన జీవో ఏమైనా సంతృప్తికరంగా ఉందా? అంటే అది చెప్పలేని పరిస్థితిలో సినీ రంగ ప్రముఖులు ఉన్నారు. నిజంగా అంత సంతృప్తిగా ఉంటే ‘ఆర్ఆర్ఆర్’ కోసం మళ్ళీ రాజమౌళి వచ్చి టికెట్ ధరల పెంపును అడగాల్సిన అవసరం ఏముంది? ఇదేనా చిరంజీవికి వైసీపీ ఇచ్చిన గౌరవం? అన్న ప్రశ్నలకు నాటి నుండి నేటి వరకు కొదవలేదు.

ఒక్క విషయంలో మాత్రం మెగాస్టార్ పై గౌరవం వైసీపీ నేతలకు పెరిగి పోతుంటుంది. గతంలో ‘రిపబ్లిక్’ సినిమా వేదికపై పవన్ కళ్యాణ్ ప్రసంగం తర్వాత మీడియా ముందుకు వచ్చిన పేర్ని నాని, ఇప్పుడే చిరంజీవితో మాట్లాడానని, అతను కూడా పవన్ ప్రసంగంతో ఏకీభవించలేదని బహిరంగ ప్రకటన చేసారు. పవన్ అలా మాట్లాడినందుకు తాను చింతిస్తున్నట్లుగా చిరంజీవి తనతో చెప్పినట్లుగా పేర్ని నాని చెప్పుకొచ్చారు.

ఇలా చిరంజీవి పేరుతో పవన్ పై మండిపడడానికి తప్ప, మరొక పరంగా చిరంజీవి వంటి వ్యక్తికి దక్కాల్సిన ప్రాధాన్యత దక్కలేదనేది, అభిమానుల మాటే కాదు, సినీ ఇండస్ట్రీలోని చాలా మంది అభిప్రాయం కూడా! ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే… తనను అడ్డు పెట్టుకుని పవన్ ను విమర్శిస్తున్నారని చిరంజీవికి తెలిసినా, బయటకు వచ్చి వాటిని ఖండించకపోవడం! ఇదే వైసీపీ వర్గాలకు అలుసుగా మారిన అంశం.