Ravichandra-Reddy YSRCP Spokesperson“సినిమా వాళ్ళందరూ బలిసి కొట్టుకుంటున్నారన్న” భావనను వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యక్తపరిచిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలను నల్లపురెడ్డి ఎందుకు చేయవలసి వచ్చిందో వైసీపీ స్పోక్స్ పర్సన్ రవిచంద్ర రెడ్డి ఓ కొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చారు.

సినిమా ఇండస్ట్రీలో కొందరు కరుడు గట్టిన భావజాలంతో ఉన్నారని, తాను ఇటీవల “పుష్ప” సినిమా చూశానని, ముందుగా ధియేటర్ లో, తాజాగా మరోసారి అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా చూశానని, లేటెస్ట్ తాను గమనించింది ఏమిటంటే, ప్రధాన విలన్ కు వెనుకాల ఉన్న విలన్స్ పేర్లన్నీ ‘రెడ్డి’ సామాజిక వర్గానికి చెందిన వారివేనని అభిప్రాయ పడ్డారు.

‘పుష్ప’ సినిమాను నిర్మించింది ఎవరా అని చూస్తే యెర్నేని నవీన్ చౌదరి అని, అంటే ఈ భావజాలం చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉండడంతోనే ప్రసన్న కుమార్ రెడ్డి ‘బలిసి కొట్టుకుంటున్నారు’ అని ఉంటారని తాను భావిస్తున్నట్లుగా రవిచంద్ర రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ భావ దారిద్య్రం ఏమిటి? సినిమాలో ఉన్న విలన్ పాత్రలకు ‘రెడ్ల’ పేర్లు ఎందుకు పెడుతున్నారు?

ఇలాగే కొనసాగితే మర్యాద దక్కదని మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాను. కానీ ‘రెడ్ల’ మీద వ్యతిరేకత పెరగాలని, చంద్రబాబు నాయుడు భావజాలంలో చాలామంది నిర్మాతలు ‘బలిసి కొట్టుకుంటున్నారు,’ వాళ్ళను ఉద్దేశించి అన్న మాటలుగా నేను అన్వయించి చెప్తున్నాను. ప్రతి ఒక్క విలన్ ‘రెడ్డి’ ఎందుకు ఉండాలి, ‘రెడ్లు’ ఏమైనా తేరగా దొరికారా? తమాషా పడుతున్నారా? రెడ్లను అంటే ఎవరు ఏం చేయరని అనుకుంటున్నారా? మర్యాద దక్కదని హెచ్చరిస్తున్నాను అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఇదిలా ఉంటే ఈ మీడియా డిబేట్ లో పాల్గొన్న మరో వ్యక్తి ‘అసలు మ్యాటర్ ను డైవర్ట్ చేస్తున్నారు’ అంటూ రవిచంద్ర వ్యాఖ్యలను ఉద్దేశించి అన్నారు. ఈ షో నిర్వహిస్తున్న రజనీకాంత్ కూడా అది సరికాదని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, రవిచంద్ర రెడ్డి మాత్రం ఎవరి మాటలను వినిపించుకోకుండా ‘రెడ్డి – కమ్మ’ సామాజిక వర్గాల నడుమ విభేదాలు వచ్చే విధంగా వ్యాఖ్యానించారు.

అయితే రవిచంద్రరెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని, దర్శకుడు క్రియేటివిటీలో భాగంగా పెట్టే పేర్లను ఇలా రాజకీయాలు చేయడం తగదని, మరి ఇంతకుముందు హీరోలకు ‘రెడ్డి’ ట్యాగ్ లు పెట్టినపుడు వీరంతా ఎక్కడ ఉన్నారని నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేసుకుంటూ ప్రశ్నిస్తున్నారు. ‘సమరసింహారెడ్డి, ఆదికేశవ రెడ్డి, ఇంద్రసేనా రెడ్డి, అర్జున్ రెడ్డి, సైరా రెడ్డి’ ఇలా ప్రముఖ హీరోలందరూ ‘రెడ్డి’ సామాజిక వర్గపు పాత్రలను చేసారని గుర్తు చేస్తున్నారు.

వైసీపీ ఎమ్మెల్యే చేసిన పొరపాటు వ్యాఖ్యలను బలపరచడం కోసం ఏదొక ‘కుంటి సాకు’ను వెతుక్కుని, ఇపుడు ‘పుష్ప’ సినిమా నిర్మాతను టార్గెట్ చేయడం తప్ప, ఈ వాదనలో పస లేదన్నది అసలు విషయం. ఇప్పటివరకు ఇలాంటి ఆలోచనలు బహుశా ఏ ఒక్కరూ కూడా చేసి ఉండరని, అయినా చంద్రబాబు నాయుడు – ‘పుష్ప’ ప్రొడ్యూసర్ ఒకే సామాజిక వర్గం అయితే, స్టోరీ చంద్రబాబు చెప్పేస్తారా? క్యారెక్టర్ పేర్లు కూడా చంద్రబాబు పెట్టేస్తారా? అంటూ నెటిజన్లు వేస్తోన్న ప్రశ్నలు కోకొల్లలు.

కధను రచించేది డైరెక్టర్, ఆ కధలోని పాత్రలకు ఏ పేరు పెట్టాలనేది నిర్ణయించేది డైరెక్టర్, ‘పుష్ప’ విషయానికి వస్తే ఆ డైరెక్టర్ పేరు బండ్రెడ్డి సుకుమార్, రవిచంద్ర రెడ్డి ఆరోపిస్తున్నట్లుగా ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు, కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. డైరెక్టర్ చెప్పిన కథను నమ్మి పెట్టుబడి పెట్టడం వరకే ప్రొడ్యూసర్ రోల్ ఉంటుందన్న కనీస అవగాహన లేకుండా వితండ వాదనను తెరపైకి తీసుకురావడం సినిమాలో కంటే ‘పెద్ద ట్విస్ట్’గా మారింది.

ఒక పొరపాటును కప్పిపుచ్చుకోవడానికి మరికొన్ని పొరపాటు వ్యాఖ్యలు చేయడం అనేది ఓ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా బాధ్యత గల స్థానంలో ఉన్న రవిచంద్ర రెడ్డికి ఏ మాత్రం తగదు. అయినా రెండు సామాజిక వర్గాల నడుమ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయడం ఎంతవరకు సమంజసమో వైసీపీ వర్గాలే ఆలోచనలు చేయాలి.