Andhra Pradesh Chief Minister Jagan Mohan Reddyఅలనాడు సీతమ్మవారికి శ్రీరాముడు అగ్నిపరీక్ష పెట్టగా ఆమె అగ్నిపునీతురాలైంది. వచ్చే ఎన్నికలు అధికార వైసీపికి కూడా అటువంటి అగ్నిపరీక్షగానే మారబోతున్నాయి. అభివృద్ధిని విస్మరించి ప్రజలకు సంక్షేమ పధకాలను ఎరగా వేసి మళ్ళీ అధికారంలోకి రావాలనుకొంటోంది. అయితే వాటితో ఓట్లు రాలుతాయా? అంటే అనుమానమే. ఎందుకంటే, ఆ పేరుతో పది రూపాయలు ముందు జేబులో పెట్టి వెనుక జేబులో నుంచి వంద రూపాయలు కాజేస్తోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరగడంతో బస్సు ఛార్జీలు, పప్పులు, నూనెల ధరలు పెరిగిపోయాయని దానికి తమ ప్రభుత్వాన్ని నిందించడం సరికాదని వైసీపీ వాదిస్తోంది. కానీ ఇంటి పన్ను ఎందుకు పెంచారు?ఈ చెత్త పన్ను ఏమిటి?ఓ పక్క విద్యుత్‌ కోతలు విధిస్తూ మళ్ళీ విద్యుత్‌ ఛార్జీలు ఎందుకు పెంచారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం సంక్షేమ పధకాల పేరిట ప్రజాధనాన్ని పప్పు బెల్లాల పంచిపెడుతూ ఆ భారం మళ్ళీ తమపైనే వేస్తోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ధిక క్రమశిక్షణ పాటించకుండా దూరదృష్టి, సరైన ఆర్ధిక, పారిశ్రామిక విధానాలు లేకుండా అగమ్యగోచరంగా పరిపాలన సాగిస్తూ మళ్ళీ జబ్బలు చరుచుకోవడం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

సంక్షేమ పధకాలే తమ పార్టీకి శ్రీరామ రక్ష అని భావిస్తుంటే అవే రాష్ట్రాన్ని నిలువునా ముంచేస్తున్నాయని అత్యధిక శాతం ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కనుక మళ్ళీ అధికారం తెచ్చిపెడతాయనుకొన్న ఆ పధకాలే వైసీపీని కూడా ముంచేయవచ్చు.

అయితే రాష్ట్రంలో ప్రజల అసహనాన్ని సిఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపి మంత్రులు, నేతలు గుర్తించలేదో గుర్తించనట్లు నటిస్తున్నారో కానీ తెలుగుదేశం పార్టీ బాగానే గుర్తించింది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణులు “బాదుడే బాదుడు…’ అనే నినాదంతో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. వాటికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుండటంతో టిడిపి మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతోంది.

గత శాసనసభ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు వచ్చే ఎన్నికలలో ఉండబోవని ఇప్పటికే స్పష్టం అయ్యింది. ఇదివరకు ప్రజలు జగనన్న పరిపాలన ‘రుచి’ చూడలేదు కనుక గత ఎన్నికలలో ఆయనకు ‘ఒక్క ఛాన్స్’ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ రుచి కూడా చూశారు కనుక మళ్ళీ మరోసారి ఆ చేదు రుచి చూడాలనుకోకపోవచ్చు. కనుక ఈసారి కూడా అలవోకగా గెలిచేస్తామనే వైసీపీ భ్రమలు వచ్చే ఎన్నికలలోనే తొలగిపోవడం ఖాయం.