Anil-Kumar-Yadav YSR Congress Partyఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో పదవులు కోల్పోయినవారు, పదవులు ఆశించి భంగపడినవారి అసమతి రాగాలు కాస్త చల్లబడ్డాయనుకొంటే, మంత్రి పదవి కోల్పోయిన అనిల్ కుమార్, ఆయన స్థానంలో నియమితులైన కాకాణి గోవర్ధన్ రెడ్డి మద్య విభేధాలతో వైసీపీ అట్టుడికి పోతోంది. కాకాణి మంత్రిపదవి చేపట్టిన తరువాత తొలిసారిగా ఆదివారం నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయన అనుచరులు భారీ ర్యాలీ తీయగా, దానికి పోటీగా మాజీ మంత్రి అనిల్ కుమార్‌ తన అనుచరులతో ఆత్మీయసభ పెట్టడంతో పార్టీలో, పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఈ సందర్భంగా అనిల్ కుమార్‌ వైసీపి అసలు రూపం ఈవిదంగా ఉంటుందని చూపడం విశేషం. పట్టణంలో గాంధీ జంక్షన్ వద్ద నిన్న నిర్వహించిన ఆత్మీయ సభలో అనిల్ కుమార్‌ మాట్లాడుతూ, “ఇంతకాలం సిఎం జగన్మోహన్ రెడ్డి మా అందరికీ మంత్రిపదవులనే కళ్ళాలు వేసి కట్టి ఉంచారు. కానీ ఇప్పుడు వాటిని తీసేశారు. ఇప్పుడు మాకు ఎటువంటి ఆంక్షలు, పరిమితులు లేవు కనుక మేము ఏమి చేయాలనుకొంటే అది చేయగలం,” అని కత్తి దూసి మరీ చెప్పారు.

మంత్రి పదవిలో ఉన్నపుడే కొడాలి నాని వంటి కొందరు బూతులు మాట్లాడేవారు. ఇప్పుడు వారి స్థానంలోకి వేరే వారు వచ్చారు. అది వేరే సంగతి. మంత్రిగా ఉండగానే తమ ప్రత్యర్ధులపై రెచ్చిపోయినవారు, ఇప్పుడు పదవి ఊడిన తరువాత బహిరంగ సభ పెట్టి తమ ప్రభుత్వంలోని మంత్రులపైనే రెచ్చిపోతుండటమే కొత్త పరిణామం.

ఇది సరిపోదన్నట్లు కాకాణి మంత్రి కాగానే నెల్లూరు కోర్టులో ఆయన కేసుకు సంబందించి ముఖ్యమైన కొన్ని కాగితాలు దొంగతనం అవడం సంచలనం సృష్టిస్తోంది. గతంలో మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయనపై పరువు నష్టం దావా వేశారు. ఆ కేసులో ఫోర్జరీ పత్రాలు కొన్ని దొంగతనం అయ్యాయి. ఇళ్ళలో దొంగలు పది డబ్బు, నగలు దోచుకుపోవడం గురించి విన్నాము కానీ ఓ కోర్టులో దొంగలు పడటం ఇదే తొలిసారి. ఇటువంటి విడ్డూరాలు ఇంకెన్ని చూడాలో?