Andhra Pradesh Chief Minister YS-Jagan Mohan Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ బహిరంగ సమావేశం పెడుతున్నారంటే సోషల్ మీడియా జనులు పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆ రోజు వారికి కావాల్సినంత పౌష్టిక ఆహారాన్ని సీఎం జగన్ అందించగలుగుతున్నారు. గత మూడేళ్ళుగా రాష్ట్రానికి ఏం చేసారో తెలియదు గానీ, సోషల్ మీడియా విపరీతంగా వ్యాప్తి చెందేందుకు మాత్రం తన వంతుగా లెక్కకు మించిన సహాయ సహకారాలు అందించారు.

తెలుగు భాష వినియోగం, ఆ పలికే పదజాలం, ఆ సందర్భంలో ప్రదర్శించే హావభావాలు… ఇలా మొత్తంగా ఓ ప్యాకేజ్ మాదిరి ఆహ్లాదకరమైన వినోదాన్ని అందిస్తూ సోషల్ మీడియా జనులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. తెలుగు భాషలోని కమ్మదనం బహుశా అందరికి అంతకుముందు తెలిసి ఉంటుంది, కానీ తెలుగు భాషను పలకడం ద్వారా పండించే కామెడీని మాత్రం ఏపీ సీఎం గారే ప్రజలకు పరిచయం చేసారు.

గతంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సహా ఏపీని పరిపాలించిన ముఖ్యమంత్రులు ఎవ్వరూ అందించలేని వినోదాన్ని తన భాషా ప్రయోగం ద్వారా పుష్కలంగా అందిస్తున్నారు వైఎస్ జగన్. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ దీనికి “జ్ఞానగుళిక” అన్న నామకరణం చేసి ప్రచారం చేస్తోంది. అందులో భాగంగా నేడు విజయవాడ ఫ్లై ఓవర్ ప్రారంభించడానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విచ్చేయగా, ఈ సందర్భంగా టీడీపీ అభివర్ణించే ఓ ‘జ్ఞానగుళిక’ను మచ్చుకు ఒకటి వదిలారు జగన్.

ఇంకేముంది… క్షణాల్లో అది వైరల్ కావడం, కేంద్రమంత్రి విచ్చేసిన సందర్భంగా సోషల్ మీడియా జనుల కడుపు నింపిన ఆ “వెన్న” మామూలుగా లేదు. ఇంతకీ అంతలా జగన్ ఏమన్నారో తెలుసా… “టూరిజంకే ‘వెన్న’ తెచ్చే విధంగా” అభివృద్ధి చేస్తానని చెప్పుకొచ్చారు. విశాఖ తీరంలోని సముద్ర తీరాన్ని తాకుతూ వెళ్లే ఆరు లైన్ల రహదారిని అభివృద్ధి చేసి టూరిజంకు వన్నె తీసుకువస్తానని చెప్పబోయి, ‘జ్ఞానగుళిక’ రూపంలో ‘వన్నె’ బదులు ‘వెన్న’ అని పలికారు ముఖ్యమంత్రివర్యులు.

ఇంకేముంది సోషల్ మీడియాకు పండగ మొదలైంది. వెన్నతో పాటు చికెన్, బటర్ చికెన్ తీసుకురా బ్రో అంటూ ఒకళ్ళు, అలాగే టూరిజంకు వెన్నతో పాటు 1కేజీ నెయ్యి, 1కేజీ జున్ను పంపించమని మరొకరు, జగన్ రెడ్డి మరో జ్ఞానగుళిక అని టిడిపి పార్టీ… ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే సోషల్ మీడియాకు దొరికిన దేవుడు మన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనిపించే విధంగా పండగగా వాతావరణం నెలకొంది. మీక్కూడా “వెన్న”తో పాటు ఏమైనా కావాలా?