YS-Jagan Mohan Reddy Andhra Pradesh Chief Ministerఏపీ ప్రభుత్వానికి వరుస దెబ్బలు తగులుతున్నాయి. వైయస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అమరావతి నిర్మాణ పనులపై తీవ్ర సందిగ్దత నెలకొని ఉండగా.. మూడు రాజధానుల కాన్సెప్టును తీసుకొచ్చింది. కానీ గతకొంతకాలంగా వైయస్ జగన్ ప్రభుత్వానికి రాజధాని విషయంలో ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. కేంద్రం అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తిస్తూ.. సచివాలయ నిర్మాణం గురించి నిధులు విడుదల చేయడం, ఏపీ రాజధాని అమరావతే అంటూ ఏపీ హైకోర్టు తీర్పునివ్వడం జగన్ ప్రభుత్వానికి మింగుడుపడటం లేదు.

ఇక వరుస దెబ్బలతో సతమతమవుతున్న జగన్ ప్రభుత్వాన్ని మరింత ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేందుకు రాజధాని రైతులు సిద్ధమవుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ తీర్పునివ్వడంతో అమరావతి రైతుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. తమ ఆకాంక్షలకు తగ్గట్టుగా తీర్పును వెల్లడించిన న్యాయమూర్తులు, న్యాయస్థానానికి రాజధాని రైతులు సాష్టాంగ నమస్కారం చేయడం వార్తల్లో నిలిచింది. హైకోర్టు తీర్పు ఇచ్చిన ఊపుతో.. అమరావతి రైతులు ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి సిద్ధమవుతున్నారు.

కొత్త నినాదం, కొత్త కార్యాచరణతో అమరావతి రైతులు తమ ఉద్యమాన్ని కొనసాగించడానికి సన్నధమవుతున్నారు. అందులో భాగంగా ఇప్పటి వరకు ‘సేవ్ అమరావతి-సేవ్ ఆంధ్రప్రదేశ్’ నినాదంతో ముందుకు సాగిన అమరావతి రైతులు ఇక మీదట ‘సేవ్ ఆంధ్రప్రదేశ్- బిల్డ్ అమరావతి’ అంటూ నినదించాలని నిర్ణయించుకున్నారు. గత ప్రభుత్వం ప్రారంభించిన రాజధాని నిర్మాణ పనులను పూర్తి చేయాలని, ఎప్పటికప్పుడు తమకు రిపోర్ట్ చేయాలని ఏపీ హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో రాజధాని రైతులు ‘సేవ్ ఆంధ్రప్రదేశ్- బిల్డ్ అమరావతి’ అంటూ నినాదాలవ్వాలని నిర్ణయించుకున్నారు.

ఏపీ రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేసేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని రాజధాని రైతులు నిర్ణయించుకున్నారు. ఇందుకు గతంలో తాము ఏర్పాటు చేసుకున్న జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ-JAC)ని మరోసారి తిరిగి పూర్తిస్థాయిలో పని చేసేలా చేసి, పూర్తి ప్రణాళికతో ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టాలని అమరావతి రైతులు కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు ఇబ్బందికరంగా మారగా.. రాజధాని రైతులకు మాత్రం ఆనందం తెచ్చింది.