andhra-pradesh-ys-jagan-teachers-dayఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సిఎం జగన్మోహన్ రెడ్డి అధ్వర్యంలో విజయవాడలో గురుపూజోత్సవం జరిగింది. అయితే ఈ కార్యక్రమాన్ని ఏపీలో ఉపాధ్యాయులందరూ బహిష్కరించిన సంగతి తెలిసిందే. కనుక గురుపూజా దినోత్సవం సందర్భంగా సిఎం జగన్‌ ఉపాధ్యాయులకు ఏవైనా వరాలు ప్రకటించి ఉంటే బాగుండేది. కనీసం వారు లేవనెత్తిన సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తానని చెప్పినా అందరూ హర్షించేవారు.

కానీ నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తున్నట్లు, “ఉపాధ్యాయులే సమాజాన్ని తీర్చిదిద్దుతున్నారని, వారిని ఇబ్బంది పెట్టే ఉద్దేశ్యం తనకు లేదంటూనే వారిని టిడిపి, మీడియా రెచ్చగొడుతున్నాయని” ఆరోపించారు. తద్వారా ఉపాధ్యాయులకు యుక్తాయుక్త విచక్షణాజ్ఞానం లేదని, వారు రాజకీయ దురుదేశ్యంతోనే నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారని ఆరోపించినట్లయింది.

ఉపాధ్యాయులు ఎక్కడ విజయవాడకు తరలివచ్చి తన క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తారో అని భయపడుతూ వారికి పోలీసులతో నోటీసులు ఇప్పించి, పోలీస్ స్టేషన్‌లకు తీసుకువెళ్లి కూర్చోబెట్టి నానా రకాలుగా అవమానించిన సంగతి మరిచిపోయి ఇప్పుడు విజయవాడకు రండి సన్మానాలు చేస్తామంటే అభిమానం ఉన్నవాళ్ళు ఎవరైనా వస్తారా?

ఉపాధ్యాయులలో వైసీపీని, సిఎం జగన్మోహన్ రెడ్డిని అభిమానించేవారు కోకొల్లలు ఉన్నారు. కానీ వారు కూడా మిగిలినవారితో కలిసి ఎందుకు నిరసనలు తెలుపుతున్నారు?మరి వారిని ఎవరు ఉసిగొల్పుతున్నారు?అని ఆలోచిస్తే లోపం ప్రభుత్వ విధానంలోనే ఉందని అర్దమవుతుంది.

ఈ కార్యక్రమంలో సిఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, తాను అన్నిటి కంటే ఎక్కువగా విద్యాశాఖ అంశాలపైనే ఎక్కువ సమీక్షా సమావేశాలలో పాల్గొన్నానని చెపుతూ విద్యా ప్రమాణాలు పెంచేందుకు తాను తీసుకొన్న చర్యలను వివరించారు. మరి అటువంటప్పుడు ఒక్క విద్యాశాఖలోనే ఇంత అలజడి ఎందుకు నెలకొంది?రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు ప్రభుత్వం తీసుకొంటున్న నిర్ణయాలను, విధానాలను ఎందుకు తప్పు పడుతున్నారు?అని ప్రభుత్వం ఆలోచించి ఉంటే నేడు ఇటువంటి పరిస్థితులు నెలకొని ఉండేవే కావు.

అసలు సజావుగా సాగిపోతున్న విద్యాశాఖలో వేలు పెట్టడం ఎందుకు? దాని వలననే కదా నేడు ఇన్ని కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాద్యాయులు వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం మొండిగా ముందుకు వెళుతున్నందునే నానాటికీ సమస్యలు పెరిగిపోతాయే తప్ప తగ్గవు. కానీ వాటికి ఉపాద్యాయులను నిందించడం, వారికీ రాజకీయరంగు పులిమి, తప్పులను కప్పిపుచ్చుకోవాలనుకోవడం, సమస్యలను పక్కదారిపట్టించాలనుకోవడం సరికాదు. దాని వలన ఉద్యోగులు, ఉపాధ్యాయులు తాత్కాలికంగా నష్టపోవచ్చు, ఇబ్బందులు పడవచ్చు కానీ చివరికి దానికి వైసీపీయే మూల్యం చెల్లించాల్సి వస్తుందని మరిచిపోకూడదు.