YS-Jagan Talli Biddi Express Scheme“జగన్ మాటలకు అర్ధాలు వేరులే” అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా సందర్భాలలో చెప్పారు. ఆ మాటలకు మరింత బలం చేకూరేలా జగన్ ప్రవర్తిస్తున్నట్లున్నారు. ‘ప్రచార ఆర్భాటాలకు’ జగన్ ప్రభుత్వం దూరం అంటూనే., “తల్లి – బిడ్డ” ఎక్స్ ప్రెస్ వాహన ప్రారంభ కార్యక్రమంతో రోడ్ల మీద పెద్ద ఎత్తున వాహనదారులని నిలిపేసి., డ్రోన్ల సహాయంతో గ్రాండ్ లుక్ కోసం వీడియోలను చిత్రీకరించారు.

మండుతున్న ఎండలకు తోడు ట్రాఫిక్ ఆంక్షలతో విజయవాడ వాసులు అల్లాడుతుంటే, ప్రభుత్వ వర్గాలు మాత్రం కెమెరాలతో ‘తల్లి – బిడ్డ’ వాహనాలను నింపాదిగా షూటింగ్ చేసుకున్నారు. అటు భానుడి వేడి., ఇటు జగన్ ప్రచారాల మధ్య నలిగిపోతున్న ప్రజలు, “ప్రచారాలకు దూరం అంటే అర్ధం ఇదేనా ముఖ్యమంత్రి గారు!? అంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.

ఈ ఒక్క సందర్భంలోనే కాదు., ఏపీలో ‘అత్యాధునిక అంబులెన్సులు’ అంటూ 108,104 వాహనాల ప్రారంభ కార్యక్రమానికి ఇదే తంతు! పాత వాహనాలను కాదని 2020లో 108,104లకు గానూ 130 వాహనాలను., 2021లో ‘రేషన్ డోర్ డెలివరీ’ అంటూ 2500 వాహనాలను.,’స్వచ్ఛ సర్వేక్ష’ పేరుతో అదే ఏడాది మరో 4 వేల చెత్త సేకరణ వాహనాలను జగన్ ప్రభుత్వం కొనుగోలు చేసింది.

“ఆరంభ సురత్వమే” అనే సామెత ఈ వాహనాల ప్రారంభ కార్యక్రమాన్ని చూస్తే అర్ధమవుతుందని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో వాహనాల కొనుగోళ్లు చేస్తున్న జగన్ ప్రభుత్వం, ఆచరణలో మాత్రం వెనుకడుగు వేస్తోందని విమర్శలు ఎదుర్కొంటుంది. ప్రారంభ కార్యక్రమంలో ‘వేల’ సంఖ్యలో కనపడిన వాహనాలు తరువాత మాత్రం ‘పదుల’ సంఖ్యలో కూడా కానరావడం లేదనేది ప్రజల భావన.

జగన్ నూతన వాహనాల కొనుగోళ్ల పేరుతో ఉన్న వాహనాలను పక్కన పెట్టి ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని., కొనుగోలు చేసిన వాహనాలు ఏమైపోతున్నాయంటూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు పని చేయాలంటూ ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం, ఖజానాలో ఉన్నదంతా వాహనాల కొనుగోళ్లతో పేరుతో ఖాళీ చేసి ప్రజలపై ‘అర్ధం – పర్ధం’ లేని ‘చెత్త’ పన్నుల వేస్తూ సామాన్యుడి జేబు కూడా ఖాళీ చేస్తున్నారని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. వాహనాల కొనుగోళ్ల మీద., వాటి ప్రచారాల మీద కాకుండా, పాలనా వ్యవస్థ మీద ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలని అప్పుడు ప్రచారం దానంతట అదే వస్తుందని ప్రజలు హితవు పలుకుతున్నారు.