YS-Jagan Eye on Vizag Film Clubఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలనే ఉద్దేశంతోనే జగన్ ప్రభుత్వం సినీ పరిశ్రమను టార్గెట్ చేసారని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్. అందుకు అనుగుణంగానే జగన్ అడుగులు వేస్తున్నారని కొంతమంది సినీ పెద్దలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. సినీ రంగ సమస్యల పరిష్కారానికి చర్చలంటూ సినీ ప్రముఖులను ఆహ్వానించి, వారిని ప్రేమగా సత్కరించిన తీరు అందరిని విస్మయానికి గురిచేసిందని చెప్పాలి.

ఈ చర్చలలో భాగంగా జగన్ ప్రభుత్వం సినీ పెద్దలకు కొన్ని ప్రతిపాదనలు సూచించారు. అందులో ఒకటి… ఏపీలో ఉన్న విశాఖను తమ తమ సినిమాలలో షూటింగ్ స్పాట్ గా వినియోగించుకొని అభివృద్ధికి దోహదపడాలని కోరింది. అలాగే సినీ ఇండస్ట్రీని విశాఖలో విస్తరించాలని ఏపీ సర్కార్ కోరింది.

సినీ ఇండస్ట్రీని విస్తరించడం అంటే సినీ పరిశ్రమకు అవసరమైన స్టూడియోస్ నిర్మాణానికి భూములను కేటాయించి.., వారి సౌకర్యాలకు అవసరమైన వనరులను సమకూర్చాలి. తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడి అక్కడి వారు ఆర్ధికంగా ఎదుగుతారు అని అందరూ భావిస్తుండగా, ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది విశాఖలో వైసీపీ నేతల తీరు.

వైజాగ్ ఫిలింనగర్ క్లబ్ లో అంతకు ముందు అధ్యక్షుడిగా ఉన్న నిర్మాత కే.ఎస్.రామారావును తప్పించి ఆ స్థానంలో వైఎస్సార్ వద్ద ప్రోటోకాల్స్ చూసిన సాయి దుర్గాప్రసాద్ ను అధ్యక్షుడిగా నియమించారు. వైసీపీ పార్టీతో అంటకాగే గోపినాధ్ రెడ్డి., కాయల వెంకట్ రెడ్డి., బీసీ ప్రసాద్ రెడ్డి అనే ముగ్గురికి కోర్ కమిటీలో నిబంధనలకు విరుద్ధంగా స్థానం కల్పించి వారి పదవి కాలాన్ని 6 ఏళ్లుగా నిర్ధారించడంతో పాటు వారికి జీవితకాలం సభ్యత్వాన్ని కల్పించారు.

ఈ నిర్ణయంపై క్లబ్ లో ముందు నుండి సభ్యత్వం ఉన్నవారు వ్యతిరేకతతో ఉన్నారు. ఈ తరహా ఆదేశాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని., లేకపోతే నిరసనలకు దిగుతామని కొందరు తమ గళాన్ని విప్పారు. ఇదంతా ఫిలింనగర్ అసోసియేషన్ లో ఉన్న 30 కోట్లు దారి మళ్లించేందుకే అనేది వీరి వాదన.

వైజాగ్ ఫిలింనగర్ క్లబ్ కు గత ప్రభుత్వంలో చంద్రబాబు తిమ్మాపురంలో రామానాయుడు స్టూడియోకి గాను 5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అయితే ఆ వ్యవహారానికి సంబంధించిన పూర్తి రిజిస్టేషన్లు పూర్తి కాక ముందే ప్రభుత్వం మారడంతో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆ భూముల రిజిస్ట్రేషన్ జరగాలంటే తమను అందులో సభ్యులుగా చేర్చుకోవాలని కండిషన్ అప్లై చేసిందని స్థానికంగా వినపడుతోన్న టాక్.

పాలనా రాజధానిగా విశాఖను జగన్ ప్రభుత్వం ఎంచుకున్న నాటి నుండి ఈ కబ్జాల సంస్కృతీ వైజాగ్ ను తాకిందని మొదటి నుండి టీడీపీ నాయకులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. వైసీపీ నాయకుల కన్ను పడితే “గుడి లేదు బడి లేదు., కొండా లేదు కోన లేదు., స్థలం లేదు పొలం లేదని” టీడీపీ సోషల్ వింగ్ నెట్టింట పంచ్ డైలాగ్స్ తో ట్రోల్స్ మొదలుపెట్టారు.

జగన్ ఈ తరహా రాజకీయాలు చేస్తే సినీ ఇండస్ట్రీ ఏపీపై ఎందుకు దృష్టి పెడుతుందని స్థానిక ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే విశాఖ భూకబ్జాల ఉదంతంతో విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ గవర్నమేంట్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటుందో లేక తమని ప్రశ్నించే ధైర్యం ఎవరికి ఉందిలేనని లైట్ తీసుకుందో చూడాలి.