Andhra Pradesh Undavalli-Arun-Kumarరాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోయిన్నప్పుడు, కొందరు పార్టీకి రాజీనామాలు చేసి తప్పుకొని గౌరవం కాపాడుకొన్నారు. వారిలో మాజీ కాంగ్రెస్‌ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ కూడా ఒకరు. ఆయన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి సన్నిహితులుగా మెలిగేవారు. కనుక వైసీపీలో చేరుతారని అందరూ అనుకున్నారు. కానీ అప్పుడప్పుడు వైసీపీకి కాస్త అనుకూలంగా మాట్లాడారు కానీ పార్టీలో చేరలేదు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ సంచలన వ్యాఖ్యలతో నేటికీ మీడియా ఫోకస్‌లో ఉంటున్నారు.

సుమారు నెల రోజుల క్రితం షర్మిల భర్త బ్రదర్ అనిల్ రాజమండ్రిలో ఆయన ఇంటికి వచ్చి కలిసి వెళ్ళారు. బ్రదర్ అనిల్ ఏపీలో బడుగుబలహీన వర్గాల కొరకు కొత్త పార్టీ పెట్టాలనుకొంటున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయనకు ఉండవల్లి ఏమి సలహా ఇచ్చారో తెలీదు కానీ బ్రదర్ అనిల్‌తో భేటీ తరువాత ఉండవల్లి స్వరంలో మార్పు వినిపిస్తోంది.

సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సంక్షేమ పధకాలను ఎరగా వేసి రాజకీయ వ్యాపారం చేస్తున్నారని, మరో విదంగా చెప్పాలంటే తనకు బాగా అలవాటైన ‘క్విడ్ ప్రో’ చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సంక్షేమ పధకాలను ఉండవల్లి ‘క్విడ్ ప్రో’గా అభివర్ణించడం మామూలు విషయం కాదు.

బ్రదర్ అనిల్‌ నిజంగానే పార్టీ పెడతారా లేదా?దానిలో ఉండవల్లి చేరుతారా లేదా?అనేది అప్రస్తుతం. కానీ ప్రస్తుతం ఉండవల్లి వైసీపీతో యుద్ధానికి సిద్దం అవుతున్నట్లున్నారు. తమ సంక్షేమ పదకాలను ఉండవల్లి ‘క్విడ్ ప్రో’గా అభివర్ణించినందుకు వైసీపీ నేతలు తప్పకుండా ఆయనపై కత్తులు దూస్తారు. అప్పుడు ఆయన కూడా ఘాటుగా స్పందిస్తారు. వారి మద్య యుద్ధం మొదలైతే అది ఏ మలుపు తిరుగుతుందో ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో మున్ముందు తెలుస్తుంది.