TTD-Meetingగడిచిన కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో టీటీడీకి సంబంధించిన ఓ వీడియో హల్చల్ చేస్తోంది. స్వామి వారి సేవల టికెట్ ధరలను నిర్ణయించే క్రమంలో టీటీడీ చైర్మన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి సంబంధించిన వీడియో ఇది.

బహుశా గత చరిత్రలో ఎప్పుడూ టీటీడీ సమావేశం ఈ విధంగా జరిగి ఉండకపోవచ్చు అన్నంత గట్టి నమ్మకాన్ని ప్రజలకు కలిగించడంలో ఈ వీడియో కీలక పాత్ర పోషించింది. వైసీపీ ఇంకా రెండేళ్లు అధికారంలో ఉంటుంది కాబట్టి, భవిష్యత్తులో టీటీడీ సమావేశాలు ఇలానే జరుగుతాయేమో అనేది ప్రజల భావన.

400 నుండి 800 పెట్టావు కదా, 800 మాత్రమే ఎందుకు 2000 చెయ్యి, కళ్యాణం టికెట్ 1000 రూపాయలు ఉంటుంది, 2000 చేద్దామా సర్? నో నో 3000 చేయండి… ఎందుకు కంగారు పడతారు మారుతీ ప్రసాద్, నేను చెప్పేది నేను చెప్తాను, తర్వాత మీ అభిప్రాయాలు చెప్పండి. ఇది టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తీరు.

తోమాలసేవ 45 నిముషాల పాటు ఉంటుంది గనుక 10 వేలు చేసేయండి అని ఒక సభ్యుడు అంటుంటే, ముందు 5000 చేద్దాం, ఆ తర్వాత మళ్ళీ పెంచుదాం, ఒక్కసారే ఎందుకు? అని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి బదులిచ్చారంటే ఏ స్థాయిలో భక్తుల మనోభావాలతో ప్రస్తుత బోర్డు ఆడుకుంటుందో అర్ధం చేసుకోవచ్చు.

ప్రస్తుతం స్వామి వారి సేవల రుసుము వందల్లో ఉండగా, వాటిని వేలల్లో పెంచి, డబ్బులున్నోళ్లే వస్తారని దానిని కవర్ చేసుకోవడం బహుశా చరిత్రలో ఇంతవరకూ ఎవరు చేసి ఉండకపోవచ్చు. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఈ టీటీడీ పాలకమండలికి స్వామి వారి పట్ల ఎంత భక్తి భావన ఉందో అవగతం చేసుకోవచ్చు.

ఈ వ్యవహారశైలిని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అయితే ఇది టీటీడీ సమావేశమా? లేక ఫిష్ మార్కెటా? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసారు. దాతల నుండి డబ్బులు సేకరించి భక్తులకు సరైన సదుపాయాలు అందజేయడం టీటీడీ విధి నిర్వహణ. అది చేయడం మానేసి ఇలాంటి వివాదాలు సృష్టించడం పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు ఆర్ఆర్ఆర్.

నెటిజన్లు అయితే భారీ స్థాయిలో ఈ వీడియోపై తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. డబ్బులున్న వారు మాత్రమే తిరుమలకు వెళ్లేలా, డబ్బులు లేని వాళ్ళు ఇంట్లోనే గోవింద గోవిందా అనుకునేలా చేస్తున్నారని, భక్తిని అడ్డం పెట్టుకుని భక్తుల దగ్గర దోచుకోవడం ఏమిటయ్యా?, వీళ్ళ దయ వలన రాబోయే కాలంలో ఆ శ్రీనివాసుడు దర్శనం దూరమయ్యేలా ఉందని తమ భావాలను పంచుకుంటున్నారు.

తిరుమలలో ఉచిత ప్రసాదమంటూ ప్రచారం చేసి, నేడు సేవల పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారనేది భక్తుల భావన. అలా కాకుండా ఉన్న రేట్లు మరింతగా తగ్గించి పేద వాళ్లకు అందుబాటులో ఉండే విధంగా చేసినా లేక స్వామి వారి సేవలు సామాన్యులకు కూడా దర్శనమిచ్చేలా నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు మరింత హర్షించేవారు.

అంతేలే… పేద వాళ్లకు స్వామి వారి దర్శనం కన్నా, సినిమా టికెట్ ధరే ముఖ్యమని జగన్ ప్రభుత్వం భావిస్తున్నట్లుంది. అందుకే సినిమా టికెట్ ధరను 5 రూపాయలకు కుదించి, స్వామి వారి విశిష్ట సేవలను 5 వేలకు పెంచింది. మునుపెన్నడూ లేని విధంగా కొండ పైన జరుగుతున్న పరిణామాలు భక్తుల ఆగ్రహాలకు కారణమవుతున్నాయి.

స్వామి వారికి దేశమంతటా, ప్రపంచమంతా భక్తులు ఉంటారు. ఆ క్రమంలోనే తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ కూడా ఈ వీడియోను షేర్ చేసుకుంటూ తమ విలువైన భావాన్ని పంచుకున్నారు. “రాజకీయాలను వ్యాపారంగా మార్చిన పెద్దలు, ఆఖరికి దైవ దర్శనాన్ని కూడా వ్యాపారంగా మార్చడం న్యాయమా?” అంటూ నిలదీశారు.