Andhra Pradesh - TS Assembly Seats - Central Govtఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాలకు కేంద్రం మరోమారు షాకిచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లను పెంచడం ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదని తేల్చి చెప్పింది. రాజ్యాంగంలోని 170 అధికరణను సవరించినదే, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అలాగే ఆ రాజ్యాంగ సవరణ ఇప్పట్లో అయ్యే పనికాదని కూడా పరోక్షంగా చెప్పకనే చెప్పింది.

‘ఆంధ్రప్రదేశ్‌లో నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉందా?’ అంటూ వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ గంగారామ్ అహిర్ పంపిన లేఖలో ఈ మేరకు పేర్కొన్నారు. 2014 ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26కు అనుగుణంగా రాజ్యాంగంలోని 170వ అధికరణను సవరించనిదే ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యం కాదని లేఖలో పేర్కొన్నారు.

ఏపీలో అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు పెంచడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. రాజ్యాంగ సవరణ జరిగితే తప్ప ఇది సాధ్యమయ్యే పని కాదని తేల్చి చెప్పారు. ఒకవేళ రాజ్యాంగాన్ని సవరించాలంటే సగానికి పైగా రాష్ట్రాలు ఈ ప్రతిపాదనను అమోదించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఆచరణకు సాధ్యం కాని విషయంగా మారిందని అన్నారు.