YS Jagan Andhra Pradesh Three Capitalsఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. జీతాలకు, పెన్షన్లకు కూడా ఇబ్బందిగా ఉన్న తరుణంలో ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తూ సంక్షేమ కార్యక్రమాల పేరిట పందేరం చేస్తుంది. దానితో రాష్ట్రంలో వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు పూర్తిగా ఆగిపోయాయి. ఒక జలవనరుల శాఖలోనే 6000 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి.

చాలా మంది కాంట్రాక్టర్లు ఏడాదిన్నరగా తమ బిల్లుల కోసం సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినా లాభం లేకపోవడంతో ఎక్కడి పనులు అక్కడ ఆపివేశారు. రాష్ట్రవ్యాప్తంగా 52 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. అయితే పట్టుమని పది ప్రాజెక్టుల పనులు కూడా ప్రస్తుతం జరగకపోవడం శోచనీయం.

చంద్రబాబు హయాంలో వారానికి ఒకసారి సమీక్షా సమావేశాలు నిర్వహించి కాంట్రాక్టర్లను పరుగులు పెట్టించే వారు. బిల్లులు కూడా సకాలంలో క్లియర్ అయ్యేవి. అయితే ప్రభుత్వం మారడంతో పద్దతి పూర్తిగా మారిపోయింది అంటున్నారు కాంట్రాక్టర్లు. ప్రభుత్వం నుండి తమకు కనీస భరోసా లేకుండా పోయిందని, రుణాలు తెచ్చి పనులు చేయించే పరిస్థితి ఇక లేదని వారు ఆరోపిస్తున్నారు.

ప్రాజెక్టు పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ల పరిస్థితి ఇలా ఉంటే వివిధ ప్రాజెక్టులకు అవసమైన భూసేకరణ పనులు ఇంకా దారుణంగా నడుస్తున్నాయి. అసలు అడిగేవారు లేకపోవడంతో ఆ విషయంలో కొంచెం కూడా పురోగతి లేకుండా పోయింది. దీనితో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది కీలకమైన ప్రోజెక్టుల పరిస్థితి.