Andhra-Pradesh-Government-to-Introduce-TOEFL-Government-Schoolsవైసీపీ ప్రభుత్వం ప్రాధమిక, ప్రాధమికోన్నత విద్యార్థులపై చేస్తున్న ప్రయోగాలు వికటిస్తున్నా, ఇంకా కొత్తకొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంది. ఇప్పటికే ఇంగ్లీష్ మీడియం కారణంగా విద్యార్దులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అది సరిపోదన్నట్లు మద్యలో బైజూస్ ఆన్‌లైన్‌ పాఠాలు ప్రవేశపెట్టి గందరగోళం సృష్టిస్తోంది. మళ్ళీ వాటి కోసం వందల కోట్లు ఖర్చు చేసి ట్యాబ్లెట్లు కొని పంచడంతో విద్యార్థులకు కొత్త ఆట వస్తువును ఇచ్చిన్నట్లయింది. దాంతో వారు పాఠాలు నేర్చుకొంటున్నారో లేదో తెలీదు కానీ సెల్ఫీలు, ఫోటోలు, వీడియోలు తీసుకొంటున్నారు. విద్యార్థులను మొబైల్ ఫోన్ల వలననే చెడిపోతున్నారనుకొంటే ప్రభుత్వమే వారికి ట్యాబ్లెట్స్ కొని ఇవ్వడాన్ని ఏమనుకోవాలి?

తాజాగా ప్రాధమిక స్థాయి నుంచే టోఫెల్ శిక్షణ ఇవ్వాలని నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు! ఇంతకీ టోఫెల్ దేనికంటే, అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా దేశాలలో యూనివర్సిటీలలో ఉన్నత విద్యాభ్యాసం చేయాలంటే ఇంగ్లీషు భాషపై పూర్తిపట్టు ఉండాలి. కనుక ఇంగ్లీషు భాషలో ప్రావీణ్యం ఎంతుందో తెలుసుకొనేందుకు ఏటా దేశవ్యాప్తంగా ఈ టోఫెల్ పరీక్ష నిర్వహిస్తుంటారు. విదేశీ యూనివర్సిటీలు టోఫెల్ మార్కులు, ర్యాంకులను పరిగణనలోకి తీసుకొంటాయి. అంటే విదేశాలలో ఉన్నత విద్యలు అభ్యసించాలనుకొనేవారి కోసమే టోఫెల్ అని అర్దమవుతోంది.

వైసీపీ ప్రభుత్వానికి దూరదృష్టి చాలా ఎక్కువ కనుక మూడో తరగతి నుంచే టోఫెల్ శిక్షణ ఇప్పించాలని నిర్ణయించింది. దీని కోసం 3 నుంచి 5వ తరగతి వరకు టోఫెల్ ప్రైమరీ, 6 నుంచి 10వ తరగతి వరకు టోఫెల్ జూనియర్ పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్స్ ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.

నేటికీ పదో తరగతి విద్యార్థులలో చాలా మందికి ఏబీసీడీలు కూడా రావు. కానీ ఈసారి పరీక్షలలో చాలామంది ఇంగ్లీషు పరీక్షలలో ఉత్తీర్ణులవడం చూసి ఉపాధ్యాయులే ఆశ్చర్యపోతున్నారు. మాతృభాష తెలుగుతో సహా సోషల్ స్టడీస్, సైన్స్, లెక్కలు, హిందీ పరీక్షలలో ఈసారి చాలా మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు.

విద్యార్ధులకు ప్రాధమిక, ప్రాధమికోన్నత స్థాయిలోనే బలమైన పునాది వేయాల్సి ఉంటుంది. అప్పుడే వారు ఉన్నత చదువులు చదివి జీవితంలో రాణించగలరు. బలమైన పునాది అంటే ఇంగ్లీషు మీడియంలో చదువుకోవడమే అని భావిస్తున్న వైసీపీ ప్రభుత్వం, విద్యార్థుల జీవితాలతో ఈవిదంగా ఆడుకొంటోంది. విద్యావ్యవస్థలో సమూలంగా మార్పులు, సంస్కరణల పేరుతో ప్రభుత్వం చేస్తున్న ఇటువంటి ప్రయోగాలతో ప్రభుత్వం పాఠశాలలలో చదువుకొంటున్న విద్యార్థుల భవిష్యత్‌ ఆగమ్యగోచరంగా మారే ప్రమాదం కనిపిస్తోంది.