YS-Jagan-Supreme-Courtవైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. దీంతో వైసీపీ ప్రభుత్వం ‘పాయింట్ ఆఫ్ నో రిటర్న్’ అంటే వెనక్కు తిరిగి రాలేని పరిస్థితికి చేరుకొన్నట్లు చెప్పవచ్చు. ఎందుకంటే, ఏపీ రాజధాని అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా కొన్ని పిటిషన్లు దాఖలై ఉన్నాయి. అమరావతిలో జరిగిన నిర్మాణాలు, ఏపీ రాజధానిపై కేంద్రప్రభుత్వ వైఖరి, దీనిపై హైకోర్టులో కేసులు, తీర్పులు తదితర అంశాలన్నీ సుప్రీంకోర్టు దృష్టిలోనే ఉన్నాయి. అలాగే మూడు రాజధానుల ప్రతిపాదన, దానిలో సాదక బాధకాలు, రాజధాని అంశం చుట్టూ ఉన్న రాజకీయాల గురించి కూడా సుప్రీంకోర్టుకి పూర్తి అవగాహన ఉంది.

ఒకవేళ హైకోర్టు తీర్పుపై స్టే విధించి మూడు రాజధానులకు అనుమతిస్తే తర్వాత అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మళ్ళీ ఎన్ని పిటిషన్లు పడతాయో కూడా సుప్రీంకోర్టుకి తెలుసు. అలాగని గుడ్డిగా హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ అమరావతిని రాజధానిగా చేయాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తుందనుకోలేము. కానీ ఈ కేసు విచారణలో ఏపీకి సంబందించి ఆర్ధిక, సామాజిక, రాజకీయ పరిస్థితులన్నిటిపై వాదోపవాదాలు జరుగుతాయి కనుక వాటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని వైసీపీ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే వైసీపీ తన చేతులు తానే కట్టేసుకొన్నట్లవుతుంది. సుప్రీంకోర్టు తిరస్కరిస్తే వైసీపీ ప్రభుత్వానికి అన్ని మార్గాలు మూసుకుపోతాయి కనుక ఇక మూడు రాజధానుల ఆలోచన కూడా చేయలేదు. అంటే పాయింట్ ఆఫ్ నో రిటర్న్ కి వచ్చేసినట్లే!

ఒకవేళ సుప్రీంకోర్టు మూడు రాజధానులకి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చినప్పటికీ, వెంటనే పడే పిటిషన్లతో విచారణ కొనసాగుతూనే ఉంటుంది కనుక అప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం అడుగు ముందుకు వేయలేదు. అయినా వైసీపీకి ఉన్నది మరొక ఏడాది సమయం మాత్రమే. ఆ లోపుగానే రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలైపోతే ఆ మాత్రం సమయం కూడా ఉండదు. కనుక సుప్రీంకోర్టు అనుమతించినప్పటికీ వచ్చే ఎన్నికలలో మళ్ళీ గెలిచి అధికారంలోకి వస్తే తప్ప మూడు రాజధానుల నిర్ణయాన్ని అమలుచేయలేదు.

అదే.. మూడు రాజధానుల అంశంతో ఇలాగే టిడిపి, జనసేనలను విమర్శిస్తూ కాలక్షేపం చేసేసి ఉంటే, రాజకీయంగా వైసీపీకి ఎటువంటి ఇబ్బందీ ఉండేది కాదు. శాసనసభ ఎన్నికలలో కూడా టిడిపి, జనసేనలు అడ్డుకోవడం వల్లనే మూడు రాజధానులు ఏర్పాటు చేయలేకపోయామని కనుక మరోసారి అవకాశం ఇస్తే తప్పకుండా అమలుచేస్తామని చెప్పి మళ్ళీ గెలిచి అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కానీ అనాలోచితంగా సుప్రీంకోర్టుకి వెళ్ళడం వలన ఒకవేళ వ్యతిరేకంగా తీర్పు వచ్చినా వైసీపీ పరువు పోగొట్టుకొని రాజకీయంగా నష్టపోతుంది. ఒకవేళ అనుకూలంగా వచ్చినా దానిని అమలుచేయలేక విమర్శల పాలవుతుంది. కనుక సుప్రీంకోర్టుకి వెళ్ళడం ద్వారా వైసీపీ రాజకీయంగా ఆత్మహత్య చేసుకొన్నట్లే.