వైసీపీ తీరుపై టీడీపీ సోషల్ మీడియా పబ్లిసిటీ!ఓ రెండు, మూడు రోజుల క్రితం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయ్యింది. వైసీపీ నేతలు కొడాలి నాని అండ్ కో చేస్తోన్న అసభ్య పదజాలం వలన పార్టీకి తీవ్ర నష్టం చేకూరుతోందని, ఇప్పటికే 10 నుండి 20 శాతం ఓటింగ్ కోల్పోయామని, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదని, జగన్ రంగంలోకి దిగి దీనికి అడ్డుకట్ట వేయాలని సూచనలు చేసారు.

ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత నుండి తన భర్త కనిపించడం లేదని సదరు వైసీపీ కార్యకర్త సోమిశెట్టి సుబ్బారావు గుప్తా సతీమణి మీడియా ముందుకు వచ్చారు. కట్ చేస్తే… సదరు సుబ్బారావును బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు చుట్టుముట్టి చితకబాదిన వీడియో నేడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుబ్బారావును మోకాలిపై కూర్చోపెట్టిన వైనం గతంలోని ఉదంతాన్ని గుర్తుకు తెచ్చింది.

కరోనా మొదటి వేవ్ లో ప్రభుత్వం మాస్క్ లు కూడా ఇవ్వడం లేదంటూ డాక్టర్ సుధాకర్ రెడ్డి వ్యక్తపరిచిన ఆవేదనకు పర్యవసానంగా నడిరోడ్డు మీద మోకాలితో పోలీసులు కూర్చోపెట్టిన ఫోటోను పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ అభిమానులు వైరల్ చేస్తున్నారు. అలాగే తెలుగుదేశం అధికారిక సోషల్ మీడియా విభాగంలో కూడా సుబ్బారావును కొట్టిన వీడియోలను అప్ లోడ్ చేసారు.

ఈ వీడియోలో సుబ్బారావును చితకబాదిన వ్యక్తి సుభాని అని, ఇతను బాలినేని శ్రీనివాసరెడ్డికి ముఖ్య అనుచరుడని, దీనికి సంబంధించిన ఫోటోలను కూడా తెలుగు తమ్ముళ్లు వైరల్ చేస్తున్నారు. సొంత పార్టీ కార్యకర్తనే ఈ విధంగా చితకబాదడం అనేది ఎలాంటి సందేశాన్ని పంపుతున్నట్లు? టిడిపి అధికారిక ట్విట్టర్ ఖాతాలో మాత్రం ‘జగన్ రెడ్డి రాజ్యంలో ప్రశ్నిస్తే చంపుడే అంట’ అన్న టైటిల్ తో వైరల్ చేస్తున్నారు.