KCR - Jaganతెలంగాణ రాష్ట్రంలో కూడా విద్యుత్ ఛార్జీల బాదుడు, విద్యుత్ కోతలు ఉన్నాయంటూ సాక్షి ఆన్‌లైన్‌ బుధవారం ఎడిషన్‌లో ఓ వార్త ప్రచురించడంతో, తెలంగాణలో టిఆర్ఎస్‌ అధికార పత్రిక ‘నమస్తే తెలంగాణ’ వెంటనే ఘాటుగా బదులిచ్చేసింది. ఈరోజు ఆన్‌లైన్‌ ఎడిషన్‌లో ‘కరెంటు మీద కనుకుట్టే’ అనే శీర్షికతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో విద్యుత్ పరిస్థితిని గణాంకాలు, ఫోటోలు, బిల్లులతో సహా కళ్ళకు కట్టినట్లు వివరిస్తూ ఓ పెద్ద ఆర్టికల్ ప్రచురించింది.

“పండిన ఆకును చూసి ఎండిన ఆకు నవ్విందంట! చేతగానమ్మకు శాపనాలు ఎక్కువ! నీకు ఇచ్చుడు చేతకాదు…కనీసం చూసుడూ చేతకాదు…”అంటూ ఎద్దేవా చేసింది.

“విద్యుత్తు నిర్వహణ శాతకాదు.. మౌలిక వసతుల కల్పన చేసుకోరు. పారిశ్రామిక వాడల్లో బీభత్సంగా పవర్‌ హాలిడేలు.. వ్యవసాయానికి ఆరేడు గంటలకు మించని సరఫరా.. ఇండ్లకు నాలుగైదు గంటల కోతలు.. వీటన్నింటినీ పట్టించుకోకుండా బిల్లులు మాత్రం అడ్డగోలుగా వస్తుంటాయి.. తిరకాసు శ్లాబులు.. అడ్డదిడ్డంగా చార్జీల పెంపు.. ఫలితం కోటి మందికి పైగా వినియోగదారుల జేబులకు షాక్‌.. ఇది మన సోదర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో దుస్థితి,” అంటూ పేర్కొంది.

నిన్న సాక్షి తెలంగాణలో విద్యుత్ బిల్లులను పోల్చి చూపితే నేడు నమస్తే తెలంగాణ ఏపీ, తెలంగాణ విద్యుత్ బిల్లులను పోల్చి చూపుతూ తెలంగాణలోనే విద్యుత్ చార్జీలు తక్కువగా ఉన్నాయని నిరూపించి చూపింది. ఏపీలో విద్యుత్ కోతలున్నా విద్యుత్ ఛార్జీల బాదుడు మాత్రం కొనసాగుతోందని ఎద్దేవా చేసింది.

తెలంగాణ రాష్ట్రంలో నిరంతరాయంగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతోందని అందుకే రాష్ట్రానికి అనేక జాతీయ అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు, ఐటి కంపెనీలు, పరిశ్రమలు తరలివస్తున్నాయని పేర్కొంది.

అంతే కాదు… తెలంగాణ రాష్ట్రంలో నిరంతరాయంగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతోందని అందుకే రాష్ట్రంలో పరిశ్రమలన్నీ నిరంతరం పనిచేస్తున్నాయని, కానీ ఏపీలో పవర్ హాలీడేస్, విద్యుత్ కోతల కారణంగా పరిశ్రమలు మూతపడుతున్నాయని రెండు రాష్ట్రాలలోని పరిశ్రమల తాజా ఫోటోలతో వాస్తవ పరిస్థితులు కళ్ళకు కట్టినట్లు చూపింది.

ఏపీలో ఇంత దయనీయ పరిస్థితులు నెలకొని ఉండగా, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రం గురించి కొన్ని పత్రికలు పని కట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నాయని నమస్తే తెలంగాణ మండిపడింది. ఆ పత్రిక ఆంద్రప్రదేశ్‌ పరిస్థితుల గురించి వ్రాసినది అక్షరాల నిజమని ఇక్కడి ప్రజలకు కూడా తెలుసు. మన ప్రభుత్వ అసమర్థత కారణంగానే ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రం నేడు ఇటువంటి దుస్థితిలో ఉందని చెంపదెబ్బకొట్టినట్లు స్పష్టంగా చెప్పింది. కనుక మన చేతగానితనానికి పొరుగువారిని నిందించి ఏం ప్రయోజనం? నిందిస్తే ఇలాగే అవహేళనలు ఎదుర్కోవలసి వస్తుందని మరిచిపోకూడదు.

AP-Telangan- Tariff

AP-Telangan- Tariff