How Will Settlers Tilt in Telangana Elections?దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. కాసేపటి క్రితం ఢిల్లీలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 175, ఒడిశాలో 147, అరుణాచల్‌ ప్రదేశ్‌లో 60, సిక్కింలో 32 శాసనసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం ఏడు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి.

ఏప్రిల్‌ 11న తొలి దశ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 11న ఎన్నికలు అంటే సరిగ్గా నెల రోజుల సమయం ఉన్నట్టు. మొదటి దశలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అదే రోజున ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతాయి. మే 23న దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అదే రోజు ఫలితాలు కూడా వెల్లడి అవుతాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరగడంతో సెట్లర్ల ప్రభావం తెలంగాణ ఎన్నికలలో చాలా వరకు తగ్గే అవకాశం ఉంది.

తెరాస, వైఎస్సాఆర్ కాంగ్రెస్ ఆరోపిస్తున్న ప్రకారం చాలా వరకు హైదరాబాద్ లోని సెట్లర్లకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఓట్లు ఉన్నాయని, వేరే వేరే రోజులలో ఎన్నికలు జరిగితే రెండు చోట్ల ఓట్లు వేసేస్తున్నారని వారు ఎన్నికల కమిషన్ కు గతంలో కంప్లయింట్ చేశారు. ఇప్పుడు ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల అలా ఓట్లు ఉన్న వారు ఎక్కడో ఒక్క చోటే ఓటు వెయ్యగలరు. షెడ్యూల్‌ ప్రకటనతో తక్షణమే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఎన్నికలు అయ్యే వరకు అధికార పార్టీలు ఎటువంటి కొత్త పథకాలు, విధాన నిర్ణయాలు ప్రకటించరాదు.