Andhra Pradesh TDP office in Mangalagiriఇప్పటివరకు హైదరాబాద్ లో ఉన్న ఏపీ రాజకీయ పార్టీలు నెమ్మదిగా అమరావతి వైపు పయనం మొదలు పెట్టాయి. చెన్నై కోలకతా జాతీయ రహదారిని ఆనుకుని రాజధాని అమరావతికి కూతవేటు దూరంలో ఉండటంతో ఈ ప్రాంతం ప్రాధాన్యం పెరిగింది. తెలుగు దేశం పార్టీ ఎప్పుడో ఇటు వైపు వచ్చేసి, ఈ వారాంతంలో మంగళగిరిలో శాశ్వత పార్టీ కార్యాలయనికి శంకుస్థాపన చేయబోతుంది.

మంగళగిరి-ఆత్మకూరు ప్రాంతంలో ఏపీ పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ ఎదురుగా కార్యాలయ నిర్మాణం జరగనుంది. మరో వైపు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్‌ ఆస్పత్రికి సమీపంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. స్థానిక వైసీపీ నేతకు చెందిన రెండెకరాల స్థలంలో పార్టీ కార్యాలయంతో పాటు జగన్‌ నివాస గృహాన్నీ నిర్మిస్తున్నారు.

ఎన్నికల ముందు ఆయన మొత్తంగా లోటస్ పాండ్ ఖాళి చేసి ఇక్కడ మకాం పెట్టాలని చూస్తున్నారట. తాజాగా జనసేన పార్టీ కూడా తన ప్రధాన కార్యాలయాన్ని మంగళగిరి ప్రాంతంలోనే ఏర్పాటు చేయడానికి రైతుల నుంచి భూమిని సమీకరించిందని సమాచారం. మంగళగిరి మండలంలోని చినకాకాని వద్ద కార్యాలయ నిర్మాణం కోసం 3.42 ఎకరాలను మూడేళ్లకు లీజుకు తీసుకున్నారు.

తొందర్లోనే పవన్ కళ్యాణ్ వచ్చి శంకుస్థాపన చెయ్యబోతున్నారు. రాబోయే ఎన్నికల కంటే ముందే అన్ని ప్రధాన పార్టీలు ఇక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నాయి. రాజకీయ వ్యూహాలు ఎలా ఉన్న ఈ కార్యాలయాల తరలింపు వలన మంగళగిరికి మహర్దశ పెట్టినట్టే అని స్థానికులు భావిస్తున్నారు.