Ayyana-Patrudu comments on 4 capitalsవైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆంధ్రప్రదేశ్ రాజధానుల విషయంలో “వివాదాలు – వైషమ్యాలు” వెంటాడుతూనే వస్తున్నాయి. ఒక్కో మంత్రి ఒక్కో స్టేట్మెంట్ తో ఒక్కో వివాదానికి తెరలేపుతున్నారు. పార్టీ అధినేత అయిన సీఎం జగన్ మూడు రాజధానుల నినాదంతో గడిచిన వెయ్యి రోజుల పాలనను కొనసాగించారు.

అమరావతే ఏపీ రాజధాని అని హైకోర్టు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చిన తరువాత కూడా వైసీపీ మంత్రి బొత్స మరో వింత వాదన తెర మీదకు తీసువచ్చారు. 2024 వరకు ఏపీ రాజధాని హైదరాబాదే అనే ఒక విచిత్ర వాదనతో మళ్లి ఏపీ ప్రజలను అయోమయంలో పడేసారు. టీడీపి పార్టీ మాత్రం అవకాశం చిక్కినప్పుడల్లా, దీనిపై “నాలుగవ రాజధాని” అంటూ గట్టి కౌంటర్లే ఇస్తూ వస్తోంది. మొన్న అచ్చెన్న., ఇప్పుడు అయ్యన్న ఇద్దరూ తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఆంధ్రపదేశ్ రాజధాని హైదరాబాద్ అయితే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి హైదరాబాద్ నుండే పాలన కొనసాగించాలని మొన్న అచ్చెన్న., నాలుగవ రాజధాని అని చెప్పిన బొత్స గారు మీ నాయకుడిని హైదరాబాద్ పంపండి అక్కడ మీ నాయకుడి కోసం శుక్రవారం కోర్టులు ఎదురు చూస్తున్నాయి., అక్కడికి వెళ్తే మీ జగన్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిస్తారని అయ్యన్న కాస్త వ్యంగ్యంగానే విమర్శలు గుప్పించారు.

ఇంతకీ ఆంధ్రప్రదేశ్ రాజధానులు ఒకటా., మూడా., నాలుగా..? అనే విషయంలో ఒక స్పష్టత ఇవ్వమని కోరుకోవడం మాత్రం ఏపీ ప్రజల వంతవుతోంది. 2024 వరకు హైదరాబాదే ఏపీ రాజధాని అని తెలిసిన మంత్రి బొత్స, గడిచిన మూడేళ్ళలో మూడు రాజధానుల నిర్ణయాన్ని ఎందుకు అంత బలంగా ప్రజలపై రుద్దారో చెప్పాలని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ అధినాయకత్వం తీసుకొనే నిర్ణయాల మీద పార్టీ నేతలకు ఆసక్తి లేకనో లేక ముఖ్యమంత్రి వర్యులకు నేరుగా ఏ విషయం చెప్పలేకనో ఈ వైసీపీ నాయకులు ఒక్కొక్కరు ఒక్కో తీరుగా మాట్లాడుతున్నారని టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి.

ముఖ్యమంత్రి “మూడు” బాగుంది అంటే, మంత్రులు “నాలుగు” కావాలి అంటున్నారు. మరి చూడాలి జగన్ మూడుతో ఆగుతారో లేక వారి సహచరులు చెప్పినట్టుగా నాలుగు చేస్తారో అని ఏపీ ప్రజలు కూడా ఆసక్తిగా వేచిచూస్తున్నారు. “మూడంటే హైకోర్టు అడ్డు పడుతుందని,” “నాలుగంటే… సీబీఐ కోర్ట్ నాలుగు మొట్టికాయలు” వేస్తుందని ఛలోక్తులు విసరడం టీడీపీ నేతల వంతవుతోంది.