Andhra Pradesh Telugu Desam Partyప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అధికార వైసీపీ-టిడిపిల మద్య యుద్ధ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో హత్యలు, మానభంగాలు, ప్రశ్నాపత్రాల లీకులు, మాస్ కాపీయింగ్ తదితర అంశాలపై టిడిపి నేతలు, కార్యకర్తలు, అనుబంద విద్యార్ధి సంఘాలు ప్రభుత్వాన్ని నిలదీస్తుండటంతో ఎక్కడికక్కడ పోలీసులు వారిని అరెస్ట్ చేయడమో లేదా పోలీస్‌స్టేషన్‌లో నిర్బందించడమో లేదా గృహనిర్బందంలో ఉంచడమో చేస్తున్నారు.

అనకాపల్లి జిల్లాలో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకులపై డీఈవో, ఎంపీడీఈవో కార్యాలయాల వద్ద తెలుగు యువత ఆధ్వర్యంలో గురువారం నిరసనలు తెలియజేయబోతున్నట్లు ప్రకటించడంతో పోలీసులు చోడవరం నియోజకవర్గానికి చెందిన తెలుగు యువత అధ్యక్షుడు దేవర రవికుమార్‌ను ముందే అదుపులోకి తీసుకొని రూరల్ పోలీస్‌స్టేషన్‌లో నిర్బందించారు.

జిల్లాలోని రావికమతం మండలంలోని తెలుగు యువత అధ్యక్షుడు ఉప్పులూరి నాగేశ్వరరావును కూడా కారణంగా పోలీసులు నిర్బందించి పోలీస్‌స్టేషన్‌లో ఉంచిన తరువాత నిరసన కార్యక్రమాలలో పాల్గొనవద్దని హెచ్చరించి పంపించేశారు.

అదేవిదంగా అనకాపల్లి పట్టణానికి చెందిన టిఎస్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు పెద్దిరెడ్డి నాగవెంకట రమణ తన ఇంట్లో నిద్రిస్తుండగా నిన్న తెల్లవారుజామున పోలీసులు వచ్చి పట్టుకుపోయారు. అతనిని పేట పోలీస్‌స్టేషన్‌లో ఉదయం 9 గంటల వరకు నిర్బందించారు. ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టనని హామీ ఇచ్చిన తరువాత ఇంటికి పంపించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి నాగవెంకట రమణ మీడియాతో మాట్లాడుతూ, “నేను టిడిపిలో ఉన్నందునే నన్ను ఈవిదంగా వేదిస్తున్నారు. కానీ నేను పోలీసుల అక్రమ కేసులకి భయపడే ప్రసక్తే లేదు,” అని అన్నారు.