Gorantla-Butchaiah-Chowdary TDPవైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నాయకుల విమర్శల జోరు చూస్తుంటే ప్రతిపక్ష పార్టీ వైఖరిలో వినూత్న మార్పు వచ్చినట్లే ఉంది. 7 పదుల వయస్సులోనూ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి.., నాయకులలో., కార్యకర్తలలో మునపటి ఉత్సాహాన్ని నింపడానికి చంద్రబాబు నాయుడు కొంత సఫలీకృతమైనట్లే కనపడుతున్నారు.

నాడు బడ్జెట్ పై లోకేష్ స్పందించిన తీరు కానీ.., టీవీ డిబేట్లల్లో పట్టాభి ప్రతిస్పందన కానీ.., రోజాపై విరుచుకుపడుతున్న అనిత కానీ.., ఏకంగా ముఖ్యమంత్రినే టార్గెట్ చేసిన అయ్యన్నపాత్రుడు తీరు కానీ సామాన్య టీడీపీ కార్యకర్తలలో నూతనోత్సాన్ని కలిగిస్తున్నాయనే చెప్పాలి. ఇప్పుడు వీరి జాబితాలోనే ప్రముఖ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా చేరారు. తన సోషల్ మీడియాలో వైసీపీ ప్రభుత్వాన్ని.., జగన్ తీరును ఒక పద్య రూపంలో ప్రజల ముందుంచారు.

వైసీపీ బడ్జెట్ చూడు మేలిమై ఉండును.,
తెరచి చుస్తే ఖజానా కాళీగా నిండును.,
అసమర్దుల చెంత మాటలే మిగులురా.,
విశ్వదాభిరామ బాబాయ్ కే దిక్కులేదురా..!

అంటూ కాస్త హాస్యంతో కూడిన వెటకారపు విమర్శలను ‘జగన్ అండ్ కో’కు రుచి చూపించారు. గోరంట్ల తన రాజకీయ అనుభవంలో పద్యాలు కూడా రాయగలిగేల చేసిన ఘనత మాత్రం వైసీపీకే దక్కింది.

తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఏపీ పేరు చెప్తే గుర్తొచ్చేది “నవ్య ఆంధ్రప్రదేశ్” అని, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం దానిని “సారా ఆంధ్రప్రదేశ్”గా మార్చిందని మద్యం దోపిడీపై పట్టాభి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి టీడీపీ ముఖ్య నాయకులను “కోర్టులు – కేసులు” అంటూ వెంటాడుతూనే ఉంది. ప్రభుత్వ వైఖరిని గమనించిన టీడీపీ నేతలు కానీ., కార్యకర్తలు కానీ కొంతకాలం స్తబ్దుగానే ఉన్నారు.

తెలంగాణలో వచ్చిన ముందస్తు ఎన్నిక ప్రచారం ఇప్పుడు ఏపీ లో కూడా విస్తృతంగానే చర్చనీయాంశమైంది. సమయం కోసం వేచి చూస్తున్న చంద్రబాబు తన విమర్శనలకు పదును పెట్టారు. అధినాయకుడే దూసుకుపోతుంటే ఇక కింద స్థాయి నేతలు కూడా ఫామ్ లోకి వచ్చినట్లున్నారని రాజకీయ వర్గాలలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ప్రతిపక్షాలు తమ బలం పుంజుకుంటున్నాయి అంటే పాలన వ్యవస్థలో లోపాలను ప్రజలు గమనిస్తున్నట్టే భావించాలని మేధావి వర్గం పేర్కొంటోంది. ప్రజలలో ప్రభుత్వం పట్ల ఏర్పడే వ్యతిరేకతను అందిపుచ్చుకున్నప్పుడే ఏ ప్రతిపక్షమైనా పాలకపక్షంగా మారుతుంది. ప్రజాస్వామ్యంలో అధికారం ఏ ఒక్కరి కాళ్ళ కింద నిలబడదు అనే విషయాన్ని రాజకీయ పార్టీలు గుర్తుంచుకుంటే రాష్ట్రాల అభివృద్ధి తో పాటు ప్రజల ఆర్ధిక – సామాజిక స్థితిగతులు మారతాయనే నిజాన్ని స్మరణకు ఉంచుకోవాలి.