Vasireddy Padma and Vangalapudi Anitha Govt Hospital Rape Issueఅమరావతికి కూతవేటు దూరంలో ఉన్న విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఓ మానసిక వికలాంగురాలిని గదిలో బందించి సిబ్బంది ఆమెపై సామూహిక అత్యాచారం చేయడం సిగ్గుచేటు. ఈ హేయమైన ఘటనపై కూడా రాజకీయాలు మొదలవడం ఇంకా సిగ్గు చేటు.

ఆస్పత్రిలో బాధితురాలిని పరామర్శించడానికి వచ్చిన మాజీ సిఎం చంద్రబాబు నాయుడు, టిడిపి నేత బోండా ఉమలకు రాష్ట్ర మహిళా కమీషన్‌ ఛైర్ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ నోటీసులు పంపడం చూసి అందరూ షాక్ అయ్యారు. నిన్న తాను బాధితురాలిని పరామర్శించడానికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు, బోండా ఉమ తన పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించారని, బాధితురాలిని కలవకుండా అడ్డుకొన్నారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. రాష్ట్ర మహిళా కమీషన్‌ ఛైర్ పర్సన్‌ అయిన తన పట్ల వారు అనుచితంగా ప్రవర్తించినందుకుగాను ఈ నెల 27వ తేదీన ఇద్దరూ విజయవాడలో తన కార్యాలయానికి వచ్చి సంజాయిషీ ఇచ్చుకోవాలని నోటీసులో పేర్కొన్నారు.

దీనిపై టిడిపి మహిళా నేత అనిత తీవ్రంగా స్పందిస్తూ, “మాజీ సిఎం, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు బాధితురాలిని పరామర్శించడానికి వస్తే ఆయనకు మహిళా కమీషన్‌ నోటీసులు జారీ చేయడం సిగ్గుచేటు. ఆమె మహిళా కమీషన్‌ ఛైర్ పర్సన్‌ అయినప్పటికీ ఇంకా వైసీపీ నాయకురాలిలాగే ప్రవర్తిస్తున్నారు.

ఇక్కడ విజయవాడలో ఇంత దారుణం జరిగితే, సిఎం జగన్మోహన్ రెడ్డి వచ్చి బాధితురాలిని పరామర్శించి ధైర్యం చెప్పి ఉంటే బాగుండేది. కానీ ఆయన ఏమీ పట్టనట్లు ఒంగోలు వెళ్ళి అక్కడ ‘అక్కచెల్లెలకు జగనన్న కానుక’ అంటూ తీపి కబుర్లు చెప్పడం సిగ్గుచేటు..బాధ్యతారాహిత్యమే.

పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలననే ఈ ఘోరం జరిగింది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే. కనుక మహిళా కమీషన్‌కు ధైర్యం ఉన్నట్లయితే ముందు సిఎం జగన్మోహన్ రెడ్డికి నోటీసులు పంపాలి మాకు కాదు,” అంటూ నిప్పులు చెరిగారు.

వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతూ, “నిజమే… పోలీసులు చురుకుగా వ్యవహరించకపోవడం వలననే ఈ ఘోరమైన నేరం జరిగింది. కానీ మిస్సింగ్ కేసుల పట్ల పోలీసులలో సాధారణంగా కనిపించే నిర్లిప్తతతోనే వారు బాధితురాలి తండ్రి పిర్యాదును సీరియస్‌గా తీసుకోకుండా, ‘ఆమె ప్రియుడితో లేచిపోయి ఉంటుందని’ భావించి ఆలస్యం చేశారు. ఒకవేళ ఫిర్యాదు చేయగానే వారు వెంటనే స్పందించి ఉండి ఉంటే ఈ నేరం జరిగేదే కాదు. కనుక బాధ్యులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని సస్పెండ్ చేసింది. ఈ కేసు విచారణ కోసం నేను బాధితురాలిని, అధికారులను, సిబ్బందిని కలిసి వివరాలు సేకరించడానికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు, బోండా ఉమా నాపట్ల చాలా అమర్యాదగా ప్రవర్తించారు. అందుకే వారికి నోటీసులు జారీ చేశాను. తప్పా?” అని ప్రశ్నించారు.

వాసిరెడ్డి పద్మ స్వయంగా పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈ నేరం జరిగిందని చెప్పడమే కాక, మహిళలకు న్యాయం చేయవలసిన ఆ పదవిలో ఉండి ‘బాధితురాలు ప్రియుడితో లేచిపోయిందేమోనని’ పోలీసులు అనుకొన్నారని చెప్పడం ఇంకా సిగ్గుచేటు. వారి నిర్లక్ష్యం కారణంగానే ఈ దారుణం జరిగిందని చెపుతూనే, చంద్రబాబునాయుడు తనను నిలదీయడం అంతకంటే పెద్ద నేరమన్నట్లు మాట్లాడటం, నోటీసులు పంపడం విస్మయం కలిగిస్తోంది. టిడిపి మహిళా నేత అనిత చెప్పినట్లు వాసిరెడ్డి పద్మ తాను ఇంకా వైసీపీ నేతననే భావిస్తున్నారేమో?